ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశారు నందమూరి తారకరామారావు. అలా అప్పుడు ఎన్టీఆర్ వేసిన బాటతో.. అటు వెండితెరను కూడా ఏలుతోంది ఆ కుటుంబం. అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం అనేది వారి అభిమానులకు లోటుగా మిగిలిపోయింది. టీడీపీలో నందమూరి కుటుంబానికి ప్రాతినిధ్యం పెరగాలంటూ ఎప్పటి నుంచో వారు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ విషయంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు.. నందమూరి కుటుంబానికి కీలక బాధ్యతలు అప్పగించడానికి రెడీ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నిర్ణయంతో నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు లేవని చెబుతూనే.. తామంతా ఒక్కటేనని చెప్పే సంకేతాలు జనాల్లోకి పంపించడం అని కూడా సీఎం భావిస్తున్నారు.
కొద్దిరోజులుగా నందమూరి యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ టీడీపీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ కూడా వారిని పెద్దగా పట్టించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో చాలామంది బాబాయి, కొడుకులకు కూడా గ్యాప్ ఉందన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇలంటి సమయంలోనే బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు లభించినపుడు.. బాల బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలపగా… కళ్యాణ్ రామ్ అయితే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. అలాగే మొన్నటికి మొన్న నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తో అభిమానుల్లో జోష్‌ను నింపగా.. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా చేత పట్టుకొని సందడి చేశారు. ఇదంతా టీడీపీ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
కాగా టీడీపీని మరో 50 ఏళ్ల పాటు ముందుకు తీసుకెళ్లాలంటే నందమూరి వారసులను కలుపుకొని పోవడం కూడా అన్న ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూనే.. నందమూరి కుటుంబాన్ని కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు చంద్రబాబు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ని ఇబ్బంది పెట్టకుండా నందమూరి కుటుంబాన్ని ఉపయోగించుకోవాలన్నదే చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది.
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి ఎప్పటినుంచో చంద్రబాబు భావిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉండేవారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో.. అప్పటినుంచి టీటీడీపీ అధ్యక్షుడు పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఇప్పుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఈ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.అందుకే ఇప్పుడు సుహాసినికి బాధ్యతలు అప్పగించడం ద్వారా మరోసారి కూడా నందమూరి కుటుంబాన్ని తాము వదులుకోము అన్నసంకేతాలు ఇవ్వడానికి సీఎం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.