ఏపీలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ అంశంపై మిత్రపక్షం జనసేన కూడా స్పందించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
తదుపరి టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని, లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై చర్చలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం కొంతమేరకు సద్దుమణిగింది. అయితే, నారా లోకేష్ ఈ అంశంపై విశాఖ కోర్టు సందర్శన సమయంలో తొలిసారిగా స్పందించారు.
తనకు డిప్యూటీ సీఎం పదవి కావాలని వచ్చిన డిమాండ్లపై లోకేష్ వ్యాఖ్యానిస్తూ, “పదవులు నాకు ముఖ్యం కావు. చంద్రబాబు గారు ఏ బాధ్యతను అప్పగించినా నేను పూర్తి చేస్తాను,” అంటూ తేల్చిచెప్పారు. అయితే, ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తానన్న అర్థాన్ని కలిగించేలా ఉన్నాయి.
అదేవిధంగా, పార్టీలో ఒకే వ్యక్తి మూడు సార్లకు మించి ఒకే పదవిలో కొనసాగడం సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని లోకేష్ వెల్లడించారు. ఈ దిశగా తాను త్వరలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మూడోసారి ఎంపీగా కొనసాగడం కంటే కొత్త బాధ్యతలు చేపట్టే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
ఇలాంటి నిర్ణయాలతోనే పార్టీలో కొత్త రక్తానికి అవకాశం లభిస్తుందని, గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకూ సంస్కరణలు తీసుకురావడం సాధ్యమవుతుందని లోకేష్ అన్నారు.