వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం నెల్లూరు వెళ్లి.. అక్కడ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లిని కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మాజీ సీఎం మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారాన్నే రేపాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేయాల్సిన పనులు చేయలేదని..కేవలం భయాదోళలనలను సృష్టించడానికి, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడానికి, దొంగ కేసులు పెట్టి ఇరికించడానికి చూస్తున్నారని జగన్ ఆరోపించారు. అంతేకాదు ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఓటు వేసిన వారిపై కక్ష సాధించేలా అడుగులు వేయడం అత్యంత హేయమైన రాజకీయమని జగన్ మండిపడ్డారు. దీనిలో భాగంగానే పిన్నెల్లిపై అక్రమంగా కేసులు పెట్టారని మాజీ సీఎం ఆరోపించారు.
పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టడంలో తప్పులేదని సమర్ధించిన జగన్ .. అందుకే ఆ కేసులో అతనికి కోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే పిన్నెల్లి రిమాండ్‌లో ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీ అక్రమంగా పెట్టిన కేసు అని జగన్ మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ వ్యాప్తంగా ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ పెట్టుకుని అందరి మీద దాడులు, వేధింపులకి దిగుతూ ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఎల్లకాలం ప్రభుత్వం వాళ్లదే ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.
మరోవైపు జగన్ గురువారం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ వేదికలో పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్‌పై మంత్రి నారా లోకేష్ అదే ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలతో బాణాలు సందించారు. డాక్టర్ సుధాకర్‌ను చంపిందెవరు? ప్రజా వేదికను కూల్చిందెవరు?బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్‌ని చంపిందెవరు? ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేసిందెవరు? అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపిందెవరు? టీడీపీ కార్యకర్త చంద్రయ్యని చంపిందెవరని లోకేష్ ప్రశ్నించారు. అంతేకాకుండా రూ.25 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్‌లో వెళ్లి మరీ.. ఈవీఎంను పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చిన పెత్తందారే దీనికి సమాధానం చెప్పాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్ వార్‌తో సోషల్ మీడియా హీటెక్కుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY