ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్సీ పోరుకు రంగం రెడీ అవుతోంది. ఏపీ శాసనమండలిలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి ఎన్నికలు మార్చి 20న జరగనున్నాయి. మార్చి 29న శాసనమండలిలో ఐదుగురు సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు.
యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పరుచూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు పదవీ విరమణకు రెడీ అవుతున్నారు. వీరి రిటైర్మెంట్, ఎమ్మెల్సీ సీట్ల ఖాళీపై సోమవారం మండలి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్సటికే షెడ్యూల్ ప్రకటించింది.
ఈ ఐదుగురి పదవీ విరమణను మండలి నోటిఫై చేశాకే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మండలి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. ముందుగా ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మార్చి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉండగా.. 13న నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు.
మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.