అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని ఆలయానికి వెళ్లారు. తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి తొలుత బేడి ఆంజనేయస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో ముఖ్యమంత్రి దంపతులకు స్వామివారి టీటీడీ ఈవో శేష వస్త్రం, చిత్ర పటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. 2025 క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.
ఇప్పటివరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై.. స్వామివారికి పట్టు వస్త్రాలు అధిక సార్లు సమర్పించిన సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం తరఫున.. సీఎం హోదాలో ఉన్న నేత పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున అతి ఎక్కువసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం తనకే దక్కిందని చెప్పుకొచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. సీఎం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
కాగా తిరుమలలో వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయ ప్రధానం చేయనున్నారు. 12వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి.
పెద్ద శేషవాహనంపై విహరించిన మలయప్పస్వామి
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా… మొదటిరోజు(శుక్రవారం) రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనం (పెద్ద శేషవాహనం)పై తిరుమాడ వీధులలో వివాహరించారు. రాత్రి 9 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది.
శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.