ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతి ఆవుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటీవల బ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతికి చెందిన “వియాటినా-19” అనే ఆవు ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ వార్తపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఒంగోలు జాతి ఆవులు తమ బలసంపత్తి, అధిక రోగనిరోధక శక్తి, విశేషమైన ఉత్పాదకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒంగోలు ఆవులకు పెరుగుతున్న డిమాండ్ రాష్ట్ర పశుసంవర్ధక రంగానికి గర్వకారణమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ జాతి రక్షణకు, పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
ఒంగోలు జాతి ప్రత్యేకతలు:
తెల్లటి శరీరం, విశేషమైన రోగనిరోధక శక్తి
చలి, వేడి వంటి ప్రతికూల వాతావరణాలను తట్టుకునే సామర్థ్యం
బలమైన ఎముకలు, గంభీరమైన శరీర నిర్మాణం
బరువులు లాగడంలో, వ్యవసాయ పనుల్లో అత్యుత్తమ పనితీరు
అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం
ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం ఈ జాతి పుట్టినిల్లు కావడంతో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా ఈ జాతికి భారీ ఆదరణ ఉంది. ఇటీవల వేలంలో వియాటినా-19 ఏకంగా రూ.41 కోట్లు పలకడం ప్రపంచ వ్యాప్తంగా ఒంగోలు ఆవులకు ఉన్న డిమాండ్‌ను వెల్లడిస్తోంది.