ఏపీలో ప్రత్యర్థి పార్టీలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం సమన్వయంతో నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కల్యాణ్ ఒకరి ఆలోచనలకు, ఒకరు విలువ ఇస్తూ కలిసి ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై తమదైన ముద్రను చాటుకుంటున్నారు. ప్రభుత్వ పాలనపై చంద్రబాబు పూర్తిగా దృష్టిపెట్టగా.. పవన్ కల్యాణ్ మాత్రం కాస్త దూకుడుగానే వ్యవహరిస్తూ. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రితో పాటు నాలుగు మంత్రిత్వ శాఖలను పవన్ కల్యాణ్ నిర్వర్తిస్తున్నారు . మొదట్లో చాలామందికి పవన్ పని తీరుపై చాలా అనుమానాలు ఉండేవి. కానీ కొద్ది రోజుల్లోనే ఆ అనుమానాలన్నిటిని పటాపంచలు చేస్తూ పాలన విషయంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు పవన్. డిప్యూటీ సీఎం అని పదవికి కొత్త నిర్వచనాన్ని చెబుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
డిప్యూటీసీఎంగా ప్రమాణం చేసిన తర్వాత పవన్.. సచివాలయంలోని తన ఛాంబర్ లో అప్పుడప్పుడూ అధికారులతో సమావేశాలు జరిపేవారు. కానీ తర్వాత తరచూ అధికారులతో సమీక్షలు జరపడం, తన శాఖలపైన బాగా పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేయడంతో ప్రజల్లోనే కాక అధికారుల్లో కూడా పవన్ అంటే ఒక నమ్మకం ఏర్పడింది. ఆ తరువాత మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పవన్ వెళ్లాక మరింత దూకుడుగా ముందడుగులు వేస్తున్నారు. ఒకవైపు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ..మరోవైపు మన్యం అభివృద్ధి, పిఠాపురం డెవలప్మెంట్ వంటి పనుల్లో బిజీ అవుతున్నారు.
పవన్ క్షేత్రస్థాయి పర్యటనలు, వైసీపీ హయాంలో అక్రమాల విషయంలో పవన్ రియాక్షన్ తలలు పండిన రాజకీయనాయకులే షాక్ తింటున్నారు. మొన్న జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల విషయంలో అయినా.. తాజాగా వైసీపీ నేత సజ్జల ఫ్యామిలీ భూముల కబ్జా వ్యవహారంలో అయినా సరే పవన్ నిర్ణయాలు చాలా దూకుడుగా ఉన్నాయి. అయితే ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతుందని..ఈ ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా కలిసే అడుగులు వేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
సీఎం చంద్రబాబు దృష్టంతా అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, వివిధ అభివృద్ధి అంశాలపై ఉంచుతున్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయ బాధ్యతలను కూడా చూస్తున్నారు. నెలవారి పింఛన్ల పంపిణీకి కూడా ఏదో జిల్లాకు హాజరవుతున్నారు. అలా తన బాధ్యతలు తాను తీసుకుంటూ.. మొత్తం క్షేత్రస్థాయి పర్యటనల బాధ్యతను పవన్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా వీరిద్దరి రాజకీయ వ్యూహంతో ఏపీ అభివృద్ధి బాటలో పడటంతో పాటు..వైసీపీ నేతల తాటలు తీయడంతో టీడీపీ, జనసేన వర్గాలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.