ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఏపీలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామ సభలు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్కు పరిపాలనతో దేశ చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. గ్రామాలకు ఆదాయం.. అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభల్లో చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు తీర్మానించనున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోని మైసూరు వారి పల్లిలో నేడు జరిగిన గ్రామ సభలో పవన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుదని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే కూటమి లక్ష్యమని తెలిపారు. గ్రామాలు, రైతులు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. అందరి దగ్గర డబ్బులుంటేనే సినిమాలు కూడా ఆడతాయని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి గ్రామ పంచాయతీలే అత్యంత కీలకమన్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో 70 శాతం మంది వైసీపీకి చెందిన సర్పంచ్‌లే ఉన్నప్పటికి పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే మనందరి ముందు ఉన్న లక్ష్యమని పేర్కొన్నారు.
కాగా ఈ సభలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రజలతో ముఖాముఖి నిర్వహించగా ఓ వ్యక్తి పవన్ సీఎం కావాలంటూ అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం గారు. ఈ పవర్ చాలదు. హైపవర్ కావాలి. అంటే 2029 లో మీరు సీఎం కావాలి. ఆ హోదాలో మా గ్రామంలో పర్యటించాలి అని మాట్లాడారు. దీనికి ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ నవ్వుతు చూద్దాం..చూద్దాం అన్నట్లు తల ఊపారు. పదవులు తనకు అలంకారం కాదు బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను నిరంతరం ప్రజల కోసం పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటానని… అహర్నిశలు పని చేస్తానని పవన్ మరో సందర్భంలో పేర్కొన్నారు.