ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఒక్క మాట కూడా తూలడం లేదు. ప్రతి నిర్ణయంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా అందరు రాజకీయ నాయకుల్లాగా తాను కాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొందరు తప్పులు చేయడం.. వాటిని కప్పిపుచ్చుకోవడం వంటివి చూస్తుంటాం. ప్రతిపక్షాలు ఆధారాలతో సహా తప్పులను బయట పెట్టినప్పటికీ.. అధికారం అండతో వాటి నుంచి సింపుల్‌గా బయటపడే వారు ఉన్నారు. కానీ అందుకు తాను పూర్తిగా వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడే మరింత బాధ్యతగా ఉండాలని చెబుతున్నారు.
ఇటీవల గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంలో.. నిండు సభలో సంచలన ప్రకటన చేశారు. తాను తప్పు చేసినా తనపై చర్యలు తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి ప్రకటన చేసిన దాఖలాలు లేవు. అలాగే గత ప్రభుత్వ పాలకులు ఎన్నో తప్పులు చేశారు.. ఆ విధంగా తాము చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాజకీయ కక్షలకు తమ ప్రభుత్వంలో తావే లేదన్నారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారమే తగిన చర్యలు ఉంటాయన్న పవన్.. తాను తప్పు చేస్తే తనపై కూడా చర్యలు తీసుకోండి అని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా తగ్గేది లేదని.. కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వంలో అవినీతికి తావే లేదని పవన్ పేర్కొన్నారు. అలాగే కూటమి సభ్యులు ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని.. అలా చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం.. ఏపీ పున:నిర్మాణం కోసం.. అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు. వైసీపీ పాలకులు అమరావతి, పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని.. నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారని మండిపడ్డారు. త్వరలోనే అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని అన్నింటిలోనూ అగ్రస్థానంలో నిలబెడుతామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE