ఏపీలో పంచాయతీ వ్యవస్థలో సమూల ప్రక్షాళన తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చాలా పంచాయతీల్లో సిబ్బంది లేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో సిబ్బంది కొరతను తీర్చడంతో పాటు సమన్వయానికి క్లస్టర్ విధానంలో సమూల మార్పులు తీసుకురావడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అమలవుతున్న విధానంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండటంతో.. కొత్త క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తేవాలని పవన్ అధికారులను ఆదేశించారు. దీంతో దీనికి సంబంధించి కార్యాచరణలో పడ్డారు పంచాయతీరాజ్ అధికారులు.
కాగా క్లస్టర్ల గ్రేడింగ్ అంటే ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కొన్ని పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండి జనాభా ఎక్కువగా ఉంటారు. జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే అటువంటి పంచాయతీల మనుగడ కష్టం. మరికొన్ని పంచాయతీలకు మాత్రం ఆదాయం బాగా ఉంటుంది కానీ అక్కడ జనాభా తక్కువగా ఉంటారు.ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఆదాయం, జనాభాను పరిగణనలోకి తీసుకొని.. క్లస్టర్లుగా విభజించి గ్రేడింగ్ చేస్తారన్న మాట. వాటికి అనుగుణంగానే నిధుల విడుదల, సిబ్బంది నియామకాలను చేస్తారు.
మరోవైపు పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎంతో పాటు..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు కూడా తీసుకున్న తర్వాత చాలా రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉపాధి హామీ నిధులను 4,500 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని పవన్ డిసైడ్ అయ్యారు. గతంలో ఈ నిధులన్నీ పక్కదారి పట్టేవి.ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు సర్దుబాటు చేసేసేవారు. కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా చూడాలని .. అందుకే రహదారులతో పాటు కాలువల నిర్మాణానికి ఆ నిధులను కేటాయించారు పవన్ . అంతేకాదు పల్లె పండుగ పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు.
అంతేకాకుండా స్థానిక సంస్థలను కూడా మరింత బలోపేతం చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులను.. నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలంటూ ఆదేశాలు ఇచ్చారు. దీనిప్రకారమే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ కూడా అయ్యాయి. వాటితో ఇప్పుడు ఏపీ ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చి..దీనికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇలా పంచాయతీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
గతంలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పంచాయతీలు నామమాత్రంగా మారి పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందుకే పంచాయతీల ఆదాయ మార్గాలు పెంచడంతోపాటు, వాటి సేవలను మరింత విస్తృతం చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు.. క్లస్టర్ విధానంలో గట్టిగా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు తాగునీటి నిర్వహణ అలాగే వీధి దీపాల నిర్వహణను సక్రమంగా చేపట్టాలని పవన్ గట్టిగా నిర్ణయించారు. అందుకే వీలైనంత త్వరగా పంచాయతీల విషయంలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి.. నివేదికలు ఇవ్వాలని..ఆ నివేదిక ఆధారంగా చేర్పులు, మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.