తెలంగాణలో హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేవంత్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. బుడమేరు వల్లే విజయవాడ వరదలు ఆ స్థాయిలో అల్లాడించాయి. ఈ బుడమేరు ఇంత పెద్ద విపత్తును కలిగించడానికి ప్రధాన కారణం ఆక్రమదారులే అని అధికారులు చెబుతున్నారు. వీళ్లు ఈ వాగు డైవర్స్‌ఫై అయ్యే పిల్ల కాలవలను మొత్తం ఆక్రమించుకోవడంతో పాటు..ఆ కాలువ పక్కన కూడా ఇల్లు కట్టేశారు. దీనివల్లే వరద నీళ్లు వెళ్లడానికి ప్లేస్ లేక త్వరగా వరద నీరు అంతా కూడా జనావాసాలను ముంచెత్తింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం వరద విపత్తు గురించి మాట్లాడుతూ హైడ్రా గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించిన భవనాలను కూలగొట్టి వాటిని రిస్టోర్ చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిందని అన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి తీసుకురావడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ పొగడ్తలు కురిపించారు. చెరువులను కాపాడే విషయంలో రేవంత్ రెడ్డి చాలా గొప్ప పని చేశారంటూ పవన్ అన్నారు. అక్రమ నిర్మాణాలనేవి లేకపోతే వరద విపత్తులు వచ్చే అవకాశమే ఉండదని పవన్ చెప్పుకొచ్చారు..
హైడ్రా లాంటి కార్యక్రమంతో అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ఎక్కడ ప్రజలయినా వరదల్లో చిక్కుకోవాల్సిన దుస్థితి రాదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అక్రమార్కులపై చర్యల కోసం హైడ్రా లాంటివి ప్రతి రాష్ట్రం కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చేసి.. ఆ తర్వాత వాటిని కూల్చేయాలని పవన్ పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా భూములను ఆక్రమించుకొని కట్టడాలను కట్టకుండా.. బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు
అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన పవన్.. భవన నిర్మాణ సమయంలో వాటిని విస్మరిస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. మానవతా దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని నష్టపరిహారం ఇచ్చి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలను కూల్చివేయాలని పవన్ సూచించారు. విపత్తు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధవంతంగా స్పందించారని ప్రశంసిస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేయకుండా సహాయక చర్యలపై దృష్టి సారించాలని చురకలు అంటించారు.