
సెప్టెంబర్ 14.. 2023న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను టర్న్ చేసింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేసింది. అప్పటి వరకు పొత్తుల విషయంలో ఉన్న సందిగ్ధత, సస్పెన్స్ కు జనసేనాని ఆ రోజున ముగింపు పలికారు. స్కిల్ స్కాంలో అరెస్టయి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసిన పవన్.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసే జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. అప్పటి వరకూ బీజేపీతో పొత్తుతో ఉన్న పవన్.. ఆ పార్టీతో చర్చించకుండానే తన నిర్ణయం ప్రకటించడం సంచలనంగా మారింది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. పవన్ ఆనాడు పొత్తుపై ప్రకటన చేసినప్పటి నుంచీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
అంతకుముందు వరకు వైసీపీ ఏపీలో తనకు తిరుగులేదన్న ధీమాతో ఉంది. వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలన అందుతుండడంపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నమ్మింది. అప్పటి వరకూ ఏ ఎన్నిక జరిగినా ఆ పార్టీ హవానే నడిచింది కూడా. సాక్షాత్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభావం చూపింది. అప్పటి నుంచే కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రకటనలు గుప్పించడం మొదలుపెట్టారు. వై నాట్ 175 అనే నినాదాన్ని అందుకున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుతో రాజకీయ పరిస్థితుల్లో కాస్త మార్పు మొదలైంది. ఆయన అరెస్టుకు జగనే కారణమనో, ఆ వయసులో చంద్రబాబును జైలుకు పంపడంతపై సానుభూతో తెలుగుదేశం పట్ల చర్చ మొదలైంది. దీనికి తోడు.. ఎన్టీఆర్ బిడ్డ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా నిజం గెలవాలి పేరుతో ప్రజల ముందుకు రావడం మొదలుపెట్టారు.
అప్పటికే ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుపై ప్రచారం నడుస్తోంది. రేపో, మాపో అంటూ చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ అందుకు సుముఖంగా లేదని, పవన్ కూడా ఆ పార్టీ చెప్పినట్లే నడుచుకుంటారన్న వాదనలు మొదలయ్యాయి. అయితే.. సెప్టెంబర్ 14న జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయి బయటకు వచ్చిన వెంటనే పవన్ పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఈ పొత్తు తన పార్టీ కోసమో, తెలుగుదేశం పార్టీ కోసమో కాదనీ, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమని చెప్పారు. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడమే లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఆ పొత్తు ప్రకటన తర్వాత జనసేనలో భిన్న వాదనలు వినిపించినా, తెలుగుదేశం ఉత్సాహంగానే ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో పొత్తు ప్రస్తావన పవన్ వ్యాఖ్యలతోనే మొదలైంది. వైసీపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని శపథం చేశారు. ఆయన ఆ ప్రకటన చేసినప్పటి నుంచీ రాష్ట్రంలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. ఒక దశలో క్షేత్ర స్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలలో పాల్గొన్నాయి. దీంతో రెండు పార్టీల మధ్యా పొత్తు ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది. దీనిపై వైసీపీ పలు మార్లు విమర్శలు గుప్పించింది. దమ్ముంటే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలంటూ.. పవన్ కల్యాణ్ కు సవాళ్లు విసిరింది. సింహం సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ రజనీకాంత్ సినిమాలోని పంచ్ డైలాగులతో ఎద్దేవా చేసింది. అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్న మాటకే పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నారు.
2019 ఎన్నికల నాటితో పోలిస్తే అప్పటికే ఏపీలో జనసేన బలం పెరిగిందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, బలమైన శత్రువును ఓడించడానికి ఆ బలం సరిపోదని పవన్ నిష్పక్షపాతంగా అంచనా వేశారు. 2014 నాటి ఫలితాలను 2024లోనూ పొందేందుకు టీడీపీతో కలిసి గత సెప్టెంబర్ నుంచి అడుగులు మొదలుపెట్టేశారు. మరోవైపు బీజేపీని, టీడీపీని కలిపే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ, చివరి వరకూ బీజేపీ దోబూచులాడింది. ఆ పార్టీతో సంబంధం లేకుండా టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ ద్వారా ఏపీలో బలపడుతూ వచ్చాయి. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా బలం పుంజుకున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చర్చకు దారి తీసేలా విజయం సాధించాయి. పొత్తు పొడిచినా సీట్ల పంపకాలు తేలవని, పంచాయితీకి దారి తీస్తాయని విపక్ష పార్టీ వైసీపీ ఆశగా ఎదురుచూసింది. కానీ, ఆ విషయంలో కూడా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్ ను గద్దె దించాలనే లక్ష్యసాధన కోసం త్యాగాలకు సిద్ధపడ్డారు. ఆ విషయంలో విమర్శలు ఎదురైనా.. జనసైనికులకు పరిస్థితులను వివరిస్తూ సర్దిచెప్పారు. ఇంతలో బీజేపీ కూడా పొత్తుకు సై అంది. అందులో కూడా పవన్ దే కీలక పాత్ర అనడంతో సందేహం లేదు. పవన్ వల్లే ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఏపీలో జగన్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడానికి అవసరమైన శక్తి, బలం, బలగం కూటమి పొందగలిగింది. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే ఆ దిశలో కొంత సక్సెస్ అయిన రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. అంతిమంగా ప్రజల తీర్పు ఎలాగున్నా.. ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ను మార్చడంలో పవన్ చక్రం తిప్పారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY