తిరుమల లడ్డూ చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు నిజం ఏంటో చెప్పాలని భక్తులు కోరుతుండగా రాజకీయ పార్టీలు మాత్రం విమర్శలు చేసుకుంటున్నాయి. మొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. తిరుమల లడ్డూ, ప్రసాదాలపై చేసిన వ్యాఖ్యలు.. వైసీపీ పార్టీ అలర్ట్ అయ్యింది. దీనిపై న్యాయపరంగా తేల్చుకునేందుకు.. లడ్డూ వివాదంపై హైకోర్టులా ఆ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్డి హైకోర్టు కమిటీతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో వైసీపీ కోరింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో వాడిన పదార్ఢాల పైన ల్యాబ్ రిపోర్టును టీడీపీ నేత ఆనం బయట పెట్టారు. అందులో విస్తు పోయే అంశాలను వెల్లడించారు. దీంతో, భక్తుల్లో ఆగ్రహం మొదలైంది. ఇక..చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి స్పందించారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి తాను ఎలాంటి పొరపాటు చేయలేదని దేవ దేవుడి సాక్షిగా తన కుటుంబ సభ్యులతో సహా కలిసి ప్రమాణం చేయటానికి సిద్దమని ప్రకటించారు. చంద్రబాబు అందుకు సిద్దమా అంటూ ప్రశ్నించారు. భూమన సైతం రియాక్ట్ అయ్యారు. రాజకీయాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎవరైనా శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేసి ఉంటే సర్వనాశనం అవుతారని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక, ఈ మధ్నహ్నం మాజీ సీఎం జగన్ ఈ వ్యవహారం పైన స్పందించనున్నారు.
ఇక ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెలిసి కలత చెందానన్న పవన్.. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ఇక ఆలయాల రక్షణపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, సనాతన ధర్మానికి ముప్పు ఎలా వచ్చినా అంతా పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత వ్యవహారంపై వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు బాధ్యులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.