తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా అందరని ఉలిక్కి పడేలా చేసింది. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం వైసిపి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేదాకా వెళ్ళింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని.. జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంటుంది.
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన అధికారిక ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ కి ఇప్పుడు మరో నటుడు ,మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇచ్చిన సమాధానం ఇప్పుడు కాకరేపుతోంది. . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన ట్యాగ్ చేస్తూ.. మీరు ఉపముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమయంలో జరిగిన ఘటన ఇది. కాబట్టి దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు అనవసర భయాలు కల్పించి , దీనిని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు , మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన గొడవలు చాలు అంటూ పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్.
కాగా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ కి రీకౌంటర్ వేస్తూ.. గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తిరుమల లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు.. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలి అని కోరారు . ధర్మ పరిరక్షణ కోసం ఆయన తగిన చర్యలు కూడా తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటివారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో..? మత కల్లోలాల రంగు ఎవరు ఎప్పుడు ఎక్కడ పులుముతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో..దయచేసి మీ హద్దుల్లో మీరు ఉండండి అంటూ ఎక్స్ వేదికగా మంచు విష్ణు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ.. ప్రకాష్ రాజ్ కు రీకౌంటర్ ఇస్తూ మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
చూస్తుంటే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఇంకా మా ఎన్నికల వేడి తగ్గినట్టుగా లేదు. గత రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీం చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు పోరు ఎంతగా జరిగిందో తెలిసిందే. మరి ఇప్పుడు విష్ణుకి కౌంటర్‌గా ప్రకాష్ రాజ్ ఏం ట్వీట్ వేస్తాడో చూడాలి. మొత్తానికి ప్రకాష్ రాజ్ మళ్లీ టాలీవుడ్, తెలుగు వారిని గెలికినట్టుగా కనిపిస్తుంది. అసలే ప్రకాష్ రాజ్‌కి తెలుగులో అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యవహారాలతో ప్రకాష్ రాజ్‌ను మరింత దూరం పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.