ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (IFR) 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే ఈ చారిత్రక వేడుకకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరై, సముద్రంపై ఉన్న యుద్ధనౌకలను సమీక్షించారు. ‘మిత్రత్వం ద్వారా సముద్ర భద్రత’ అనే నినాదంతో జరుగుతున్న ఈ వేడుకలో భారత్తో పాటు పలు విదేశీ నౌకాదళాలు కూడా భాగస్వామ్యం అయ్యాయి.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ సుమిత్ర నౌకపై నుంచి యుద్ధనౌకలను తిలకిస్తూ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహా పలువురు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక యుద్ధనౌకలు, విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యలు ఈ సమీక్షలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత నౌకాదళం కేవలం సరిహద్దుల రక్షణకే కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలకు కట్టుబడి ఉందనే సందేశాన్ని ఈ సమీక్ష ద్వారా అందించారు.
ఈ ఐఎఫ్ఆర్ 2026లో మొత్తం 66 భారతీయ యుద్ధనౌకలు మరియు 19 విదేశీ యుద్ధనౌకలు పాల్గొని తమ జలవిన్యాసాలతో అబ్బురపరిచాయి. వీటితో పాటు 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సముద్ర ఉపరితలంపై గగనతల విన్యాసాలు చేశాయి. అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి అగ్రరాజ్యాల నౌకాదళాలు కూడా ఈ సమీక్షలో భాగం పంచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం ప్రతిష్ట పెరిగింది. నౌకాదళ సిబ్బంది ప్రదర్శించిన క్రమశిక్షణ, సమన్వయం మరియు సాంకేతిక నైపుణ్యం చూసి అతిథులు మంత్రముగ్ధులయ్యారు.
విశాఖపట్నం సముద్ర తీరంలో జరిగిన ఈ బృహత్తర కార్యక్రమం భారత రక్షణ రంగం సాధిస్తున్న పురోగతికి నిదర్శనం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధనౌకలు అధిక సంఖ్యలో పాల్గొనడం ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో నౌకాదళం ముందంజలో ఉందని నిరూపించింది. ఈ వేడుక ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలపరచడమే కాకుండా, సముద్ర మార్గాల ద్వారా జరిగే వాణిజ్యానికి రక్షణ కల్పించడంలో భారత్ పాత్రను ప్రపంచానికి తెలియజేసింది.







































