అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ మే 2న శంకుస్థాపన చేయనున్నారు.అశేష జనవాహిని నడుమ అమరావతి పునఃనిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రివర్గ ఉప సంఘం సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా.. ప్రధానమంత్రి కార్యాలయం మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు కేంద్ర బలగాలు కూడా అమరావతిని సందర్శించాయి. నిఘా వర్గాలు అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
ప్రధాని పర్యటనలో షెడ్యూల్ ప్రకారం.. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం చేరుకున్న ప్రధాని .. అక్కడ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో మూడున్నర గంటలకు అమరావతిలోని హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రధాన వేదిక వరకు 15 నిమిషాల పాటు 1.1 కి.మీటర్ల వరకూ రోడ్డు షోలో పాల్గొంటారు. 3:45 గంటల నుంచి నాలుగు గంటల వరకు అమరావతి పెవిలియన్ ను సందర్శించి.. తరువాత సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు సభలో పాల్గొంటారు. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన అనంతరం ప్రధాని ప్రసంగం ఉంటుంది. సభను ముగించుకుని సాయంత్రం 5:10 గంటలకు హెలిక్యాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి .. 5:30కి గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం మూడు వేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు . ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా 100 మంది వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాని సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది వస్తారన్న అంచనాలతో వారి రాకపోకల కోసం 8 రోడ్లను, 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు.