తెలంగాణలో టాలీవుడ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పుష్ప-2 సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణం కోల్పోవడంతో, ప్రభుత్వం బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ, టికెట్ ధరల పెంపుపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే, ఈ వివాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు “సోఫా” ట్వీట్ తో కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు.
అంబటి రాంబాబు తన ట్వీట్‌లో పుష్ప-2 చిత్రంలోని సోఫా సీన్‌ను ప్రస్తావిస్తూ, “పూర్తి పరిష్కారానికి ‘సోఫా’ చేరాల్సిందే!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పుష్ప-2 సినిమాలో హీరో అల్లు అర్జున్ తన ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకునేందుకు సోఫాలో డబ్బు పంపే సీన్ హైలైట్‌గా ఉంటుంది. ఆ సీన్‌ను గుర్తుచేసేలా అంబటి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే, ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, అది రేవంత్ రెడ్డిని ఉద్దేశించినట్లు కనిపిస్తోంది.
సీఎం రేవంత్ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని, బౌన్సర్ల నియామకంపై కఠిన నిబంధనలు తీసుకురావడం, ప్రజలకు అందుబాటులో టికెట్ ధరలు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సీఎం రేవంత్ ప్రతినిధుల సమక్షంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు, టాలీవుడ్‌ను సామాజిక బాధ్యతగా డ్రగ్స్ నివారణ, మహిళా భద్రత వంటి అంశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రోత్సహించారు.
పుష్ప-2 నేపథ్యంలో…
సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టు, బెనిఫిట్ షోల రద్దు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, ఈ చర్చలపై అంబటి చేసిన “సోఫా” ట్వీట్ మరింత చర్చకు దారి తీసింది.
పూర్తి పరిష్కారానికి
"Sofa" చేరాల్సిందే!— Ambati Rambabu (@AmbatiRambabu) December 26, 2024