తాజాగా బంగాళాఖాతం నుంచి వచ్చిన మరో అలెర్ట్ ఏపీ రైతులను కలవరపెడుతోంది. ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం..నిన్న నైరుతి బంగాళాఖాతం వైపు ప్రవేశించింది. ఇది సముద్ర మట్టానికి 3.2 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీవ్యాప్తంగా తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 12వ తేదీ వరకు సాధారణ వాతావరణం కొనసాగుతుందని, దక్షిణ కోస్తాలో మాత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఉపరితల ఆవర్తనం మరో నాలుగు రోజులు ఉంటుందని.. ఏపీలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది. తెలంగాణకు ఎటువంటి వర్ష సూచనలు లేవు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు పెరగడంతో.. చలి తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఏపీకి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరుస వర్షాలతో పంటలకు అపార నష్టం కలిగింది. ముఖ్యంగా వరి కోతల్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయి రంగు మారడంతో.. వాటి కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ధాన్యం తడిచినా.. 25 శాతం వరకు తేమ ఉన్నా కూడా సాధారణ ధరనే చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీచేయడం కాస్త ఊరట నిచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ వర్షాల హెచ్చరికలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.