రాజకీయ నాయకులను వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

Lasya nanditha, road accidents, nandamuri hari krishna, bhuma shobanagireddy,politicians,politicians deaths,accidents, mlc shaik sabji,bjp,latest telangana updates,Telangana political updates,telangana news,secundrabad,Mango News Telugu,Mango News
Lasya nanditha, road accidents, nandamuri hari krishna, bhuma shobanagireddy

రోడ్డు ప్రమాదాలు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. వారి కుటుంబాల్లో విషాదాలను మిగుల్చుతున్నాయి. మన దేశంలో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఇటీవలకాలంలో రాజకీయ నాయకులను రోడ్డు ప్రమాదాలు వరుసగా వెంటాడుతున్నాయి. వారిని కలవరపెడుతున్నాయి. గతంలో టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, వైసీపీ నేత భూమా శోభానాగిరెడ్డి.. కొద్దిరోజుల క్రితం ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారు. ఇప్పుడు యవనేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను కూడా రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది.

శుక్రవారం తెల్లవారుజామున లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. పటాన్‌చెరు ఓఆర్ఆర్‌పై అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో లాస్య నందిత స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత పీఏ ఆకాష్, కారు డ్రైవర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గర్లోని అమేథా ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగంతో వెళ్లడంతో పాటు.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు  ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

సీనియర్ రాజకీయ నేత, నాలుగుసార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న కూతరే లాస్య నందిత. గతేడాది సాయన్న అనారోగ్యం బారిన పడి మరణించారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాయన్న కూతురు లాస్య నందితకు టికెట్ ఇచ్చింది. ఈ మేరకు లాస్య కాంగ్రెస్ అభ్యర్థి, ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తెపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. రెండు నెలల క్రితమే లాస్య ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను వెంటాడి బలి తీసుకుంది.

గతంలో కూడా ఎంతో మంది రాజకీయ నాయకులు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సినీనటుడు, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. 2018 ఆగష్టులో హరికృష్ణ హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని కావలికి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. హరికృష్ణనే స్వయంగా కారు నడుపుతున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో హరికృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అంతకముందు వైసీపీ నేత, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2014లో నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా.. శోభానాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. తీవ్రంగా గాయపడిన శోభానాగిరెడ్డిని నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శోభానాగిరెడ్డి మరణించారు.

కొద్దిరోజుల క్రితం ఏపీకి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కూడా రోడ్డు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రెండు నెలల క్రితం భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి వెళ్తుండగా.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి వద్ద సాబ్జి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. వారు ప్రయాణిస్తున్న కారును అదుపుతప్పి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి స్పాట్‌లోనే మరణించారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ కూడా రోడ్డు ప్రమాద బారిన పడ్డారు. హైదరాబాద్‌ నుంచి ధర్మపురి వెళ్తుందగా.. అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది.ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో లక్ష్మణ్ కుమార్ బయటపడ్డారు. అంతకంటే ఏపీలోని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కూడా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. రవికుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైఢర్‌ను ఢీ కొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి రవికుమార్ సురక్షితంగా బయటపడ్డారు. ఇలా రాజకీయ నాయకులను రోడ్డు ప్రమాదాలు వరుసగా వెంటాడుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =