చేసుకున్నవారికి చేసుకున్నంత అన్న సామెత ఇప్పుడు అక్షరాలా వైసీపీ నేతలకు వర్తిస్తుంది.అధకారం ఉంది కదా అని ఆనాడు అడ్డగోలు పనులు చేయడం, అడ్డంగా మాట్లాడటంతో.. ఇప్పుడు ఒక్కొక్కరిగా జైలు ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతోనే మొన్న వంశీ, తర్వాత పోసాని కృష్ణ మురళి నెక్ట్స్ ఎవరనే ప్రశ్నలు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే విజయసాయిరెడ్డి, విడదల రజినీ, దువ్వాడ శ్రీనివాస్ మీద ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజని హయాంలో జరిగిన అవకతవకలపై బాధితులే నేరుగా మీడియా ముందుకు రావడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రజినీకి ఉచ్చు బిగుసుకున్నట్లే కనిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
రజినీ విషయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవ చూపడంతో.. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. ఇటీవల ఓ స్టోన్ క్రషర్ విషయంలో డబ్బులు తిన్నారన్న ఆరోపణులు ఖండించిన విడదల రజినీ .. తనపై రాజకీయ కక్ష సాధింపునకు దిగుతున్నారని చెప్పుకొచ్చారు. అదే రజినీ ఇప్పుడు ఓ ఒప్పందం విషయంలో రైతులకు తిరిగి డబ్బులు చెల్లించడంతో అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు ఒప్పుకున్నట్లు అయింది. నిజానికి ఇలా రైతులకు రజినీ డబ్బులు చెల్లించిన విషయం తెలిసే..తన వద్ద వసూలు చేసిన సొమ్ము కూడా తిరిగి ఇవ్వాలని స్టోన్ క్రషర్ యజమాని కోరడం..తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి రజిని, ఆమె మరిది, రజినీ పీఏ చర్యలు బయటపడ్డాయి.
2019ముందు వరకూ విడదల రజినీ టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలుగా కొనసాగేవారు. అయితే ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా మారిపోయి జగన్ ప్రభంజనంలో గెలిచారు. అది మొదలు రజినీ హవా ప్రారంభం అయ్యిందనే చెప్పుకోవాలి. మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కడంతో..కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ సమయంలో అక్రమ సంపాదనకు బాగా అలవాటుపడ్డారన్న వాదన వినిపించేది.
పల్నాడు జిల్లాలో ఏ చిన్న చాన్స్ వచ్చినా రజినీ వెనక్కి తగ్గలేదనని… ముఖ్యంగా ఆమె మరిది, ఆపై పిఏ కలెక్షన్ల పర్వానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బదిలీలు, ప్రమోషన్ల సమయంలో రజినీ భారీగా అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నియామకాలు చేపట్టారన్న ఆరోపణ కూడా ఉంది. అయితే అప్పట్లో ఐపీఎస్ అధికారి జాషువాను అడ్డం పెట్టుకుని.. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి మరీ రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. అయితే ఇది రైతుల విషయంలో చెల్లింపుల తర్వాతే బయటపడింది.
చిలకలూరిపేట నియోజకవర్గంలో కొంతమంది రైతులకు ప్రభుత్వం గతంలో సొసైటీ పరంగా భూములు కేటాయించింది. దీంతో దశాబ్దాలుగా సంబంధిత రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమిలో విలువైన ఖనిజం ఉందని తెలియడంతో ముఖ్యమంత్రి జగన్ బంధువులు రంగంలోకి దిగారని… ఎకరాకు 8 లక్షల రూపాయల చొప్పున సర్దుబాటు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో మంత్రిగా ఉన్న విడదల రజిని కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఆ బాధిత రైతులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మరోవైపు చాలామంది రైతుల వద్ద జగనన్న కాలనీ లేఅవుట్ల కోసం భూములను సేకరించారు. ప్రభుత్వం వద్ద ఎక్కువ రేటుకు తీసుకుని రైతులకు మాత్రం తక్కువ ధర చెల్లించారు. అటువంటి వారంతా కూడా ఇప్పుడు బయటపడుతున్నారు.ఇలా వీరంతా నేరుగా ఫిర్యాదు చేస్తుండడంతో విడదల రజిని పేరు బయటకు వచ్చింది. దీంతోనే ఆమె కొంతమంది రైతులకు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. తన తప్పు బయటపడకుండా చేద్దామనుకున్న క్రమంలో అందిరి దగ్గర అడ్డంగా బుక్కయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.