
ఆంధప్రదేశ్‌లో పోలింగ్ రోజు, అనంతరం జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం ఆదేశాలతో విచారణ అధికారులు వేగంగా దర్యాప్త చేపడుతున్నారు. హింసాత్మక ఘటనలపై ఏర్పడ్డ సిట్ ఇప్పటికే ప్రాథమిక విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో విచారించి, ఘటనా స్థలాలను పరిశీలించి దర్యాప్తు అధికారులు నివేదికను సిద్ధం చేశారు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఈమేరకు ఆ నివేదికను డీజీపీకి ఈరోజే అందించనున్నారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి ప్రాథమిక నివేదిక అందనుంది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది. రెండు రోజులపాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి.
అనంతపురం, తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల తదితర ప్రాంతాల్లో సిట్ అధికారులు రెండు, మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీలకు చెందిన పలువురు నేతలను విచారించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. సుమారు 13 కేసులు నమోదైనట్లు గుర్తించి, ఎవరు ఫిర్యాదు చేశారు.., ఎవరిపై ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయో విచారణ జరిపారు. రెండు రోజులపాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తింపు, సీసీ కెమెరాలు పరిశీలన, వారిపై నమోదైన కేసులను సైతం పరిశీలించాయి. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం,ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
అల్లర్లకు సంబంధించి కొన్ని వీడియోలను కూడా పోలీసు అధికారులు పరిశీలించారు. వాటి ద్వారా కొందరు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. అదే సమయంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా తమ వద్ద ఉన్న ఆధారాలను, వీడియోలను సిట్ అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. వారి ఫిర్యాదులను కూడా తమ నివేదికలో సిట్ పొందుపరిచినట్లు తెలిసింది. మరోవైపు.. చంద్రగిరి హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ ఏకంగా మూడు రోజులు కొనసాగింది. చంద్రగిరిలో జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు, కూచువారిపల్లె గ్రామాస్థులు అందించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన సిట్ బృందం ఓ నివేదికను తయారుచేసింది. పల్నాడు జిల్లాలోని క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోను, పెదకూరపాడు నియోజకవర్గంలోని దొడ్లేరు, వేల్పూరు గ్రామాల్లో కూడా అధికారులు పర్యటించి ఇప్పటికే కొన్ని వివరాలు సేకరించారు. ప్రాథమిక నివేదికలో ఈ వివరాలన్నింటినీ సిట్ తన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటికే సిద్ధమైన తొలి నివేదిక ఈరోజే ఉన్నతాధికారులకు అందే అవకాశాలు ఉన్నాయి. వాటిని పరిశీలించిన అనంతరం ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధం కానున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో నిర్లక్ష్యం వహించిన, ఓవర్గానికి కొమ్ముకాసిన పోలీసులను ఇప్పటికే ఈసీ సస్పెండ్ చేసింది. నివేదికను పరిశీలించిన తర్వాత ప్రజాప్రతినిధులపై కూడా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో ఏపీలో ఉత్కంఠ ఏర్పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY