ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం కూటమి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమయింది. ఈక్రమంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. కీలక నేతలు ఆ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. కొందరు ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని.. మరికొంత మంది కీలక నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు మార్గాల కోసం అన్వేశిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే బాలినేని జనసేనలో చేరబోతున్నారని.. ఇప్పటికే తెర వెనుక జనసేనాని పవన్ కళ్యాణ్‌తో బాలినేని మంతనాలు జరిపారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈవిషయంపై తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని.. వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంల ఎటువంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలోకి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కొందరు కావాలనే తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీకి అనూహ్య ఫలితాలు వచ్చాయని.. ప్రస్తుతం వాటిని సమీక్షించుకుంటున్నామని బాలినేని వెల్లడించారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దని చెప్పారు. దీంతో బాలినేని పార్టీ మారబోతున్నారంటూ జరిగిన ప్రచారానికి చెక్ పడినట్లు అయింది.
అలాగే వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై బాలినేని భగ్గుమన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలపై ఎటువంటి దాడులు చేయలేదని అన్నాు. తాను ఇప్పటి వరకు అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ఏరోజు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించలేదని.. కూటమి చేస్తున్నది మంచి పద్ధతి కాదని బాలినేని వెల్లడించారు. అలాగే తాము అధికారంలో ఉన్నప్పుడు తనపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేశాయని.. వాటిని ఇప్పుడు నిరూపించాలని బాలినేని డిమాండ్ చేశారు. అలాగే ఒంగోలు వైసీపీ అధ్యక్ష పదవిపై కూడా బాలినేని స్పందించారు. ఆ పదవిని స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒంగోలు వైసీపీలో ఎంతో మంది సమర్థవంతమైన నాయకులు ఉన్నారన్నారు. వారిలో ఎవరికి ఇచ్చినా పార్టీకి మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ