ఏపీ కేబినెట్లో బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా..కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈగల్ పేరుతో.. యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో 85 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. నేరాలను నియంత్రించడానికి పీడీ యాక్ట్ పటిష్టం చేసేలా.. సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేయగా… లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపైన కూడా మంత్రి వర్గం చర్చించింది. పార్లమెంట్‌లో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
అలాగే దేవాలయ కమిటీల్లో కొత్తగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో పాటు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకుంది. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్ అనే పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.
మరోవైపు స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపైన చట్ట సవరణ బిల్లుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువు నాలుగేళ్లు ఉండగా..దానిని నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ చట్ట సవరణ చేసింది.
ఇటు కొత్త క్రీడా పాలసీకి కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో విలీనం చేయడానికి మంత్రి వర్గం ఆమోదం లభించింది.