ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మార్పును ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. అప్పటికీ , ఇప్పటికీ ఉన్న ఏపీని గాడిన పెట్టడానికి ఈ కొద్ది రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలు ఎంతగా కష్టపడుతున్నారో అర్ధం చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో ప్రతి శనివారం మంత్రి నారా లోకేష్.. ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్నారు. ప్రజలను ముఖాముఖిగా కలుసుకుంటూ.. స్థానికంగా వారు ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు వాటిని పరిష్కరించేలా లోకేష్ అక్కడికక్కడే ఆదేశాలను జారీ చేస్తున్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. జనవాణి పేరుతో అధికారంలోకి రాకముందు నుంచీ జనవాణి కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చేబ్రోలులో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఈరోజు ఉదయం 9 గంటలకు జనవాణి కార్యక్రమం ప్రారంభమయింది. ఇది శనివారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అంటే ఈ అయిదు రోజులూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామాన్య ప్రజల నుంచి వివిద ఫిర్యాదులను స్వీకరిస్తారు.
జనవాణి కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను డిప్యూటీ సీఎంకు అందేలా ఏర్పాట్లు చేశారు.అయితే అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్.. ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాడారు.
తిరుపతి, మంగళగిరి, భీమవరం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం.. వంటి ప్రధాన నగరాల్లో జనవాణి కార్యక్రమం జరిగేలా ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ప్రజలను నేరుగా కలుసుకున్న పవన్ కళ్యాణ్… అధికారంలో లేకపోయినా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు.
కాగా టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత..జరగుతున్న ఈ జనవాణి కార్యక్రమం రెండోది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండు వారాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. దీన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేసేలా పవన్ చర్యలు తీసుకుంటున్నారు.