స్వర్ణాంధ్ర 2047: చంద్రబాబు కలలు నిజం అవుతాయా?

Swarnandhra 2047 Will Chandrababus Dreams Come True

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు ‘గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. “ఎక్కడికెళ్లినా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. వ్యాపార లక్షణాలు మన రక్తంలోనే ఉన్నాయి,” అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

1991 ఆర్థిక సంస్కరణలతో భారత్‌లో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, ఐటీ రంగం అభివృద్ధితో హైదరాబాద్‌ను పలు రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ అగ్ర నగరాల సరసన చేర్చామన్నారు. రెండు అంకెల అభివృద్ధి సాధించడమే అసలైన మార్పుకు బాటపెడుతుందన్నారు.

పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్) మోడల్ ద్వారా అద్భుతాలు చేయవచ్చని, పేదరిక నిర్మూలన కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆలోచనలకే కాకుండా, అవి కార్యరూపం దాల్చేలా చేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్ గురించి టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ప్రశంసిస్తూ, “చంద్రబాబు గారి విజన్ వల్లే నేడు హైదరాబాద్ అంత అభివృద్ధి చెందింది. స్వర్ణాంధ్ర 2047లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది,” అని పేర్కొన్నారు.