మూడోసారి ప్రధాన మంత్రి అయి చరిత్ర సృష్టించాలని ఆరాటపడ్డారు నరేంద్ర మోడీ. భారత దేశ తొలి ప్రధాని నెహ్రూ రికార్డును సమం చేయాలని పరితపించారు. కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేశారు. కానీ తాజాగా వెల్లడయిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి తేడా కొట్టాయి. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈసారి పక్కాగా 400లకు పైగా స్థానాల్లో జెండా ఎగరేస్తామని బీజేపీ జోరుగా ప్రచారం నిర్వహించింది. బీజేపీకి 400 కాకపోయినా 350కి పైగా స్థానాల్లో గెలుపొందుతుందని జనాలు కూడా విశ్వసించారు. కానీ ఫలితాల వరకు వచ్చే సరికి బెడిసి కొట్టింది. కేవలం 238 స్థానాల్లో మాత్రమే బీజేపీ జెండా ఎగురవేసింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 304 స్థానాలను దక్కించుకుంది. కానీ ఈసారి గతంతో పోల్చుకుంటే 66 స్థానాలు తగ్గాయి. ఇదే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉండగా.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 272గా ఉంది. దేశంలోని అతి ఎక్కువ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ బీజేపీ పావులు అక్కడ పారలేదు. గతంలో అక్కడ దక్కించుకున్న సీట్ల కంటే ఈసారి సగానికి సగం సీట్లు తగ్గాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి ఇదే పరిస్థితి ఎదురయింది.
ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు కింగ్ మేకర్లుగా మారారు. టీడీపీ వద్ద 16 మంది, జనసేన వద్ద ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ 18 ఎంపీల బలం ఎంతో కీలకం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్ధతు ఇవ్వకపోతే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కింగ్ మేకర్లు అయ్యారు. అందరి దృష్టి అంతా వారిపైనే ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కీలకంగా మారిన చంద్రబాబు, పవన్.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి తీసుకొస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకొని వస్తారా అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
గతం రెండు పర్యాయాలు కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీతో ఉంది. అందుకే ఏపీ నుంచి ఎంపీలు బీజేపీకి మద్ధతు ఇచ్చినా.. కేంద్రం ఏపీని సరిగా పట్టించుకోలేదు. హామీలను నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు ఏపీ ఎంపీలే అత్యంత కీలకంగా మారారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. వారి మద్ధతు లేనిదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరదు. ఈక్రమంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విషయంలో.. విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి విషయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పట్టు పట్టాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY