మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా కూడా ఇవి ఆగడం లేదు. తాజాగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. టీచర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈడుపుగల్లు గ్రామంలోని పాఠశాలలో పని చేసే మండవ వెంకట శ్రీనివాస్ గత కొంతకాలంగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు.
కొన్నాళ్లుగా రెండో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినులతో శ్రీనివాస్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ బాధిత విద్యార్థిని ఆదివారం ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. మిగితా విద్యార్థునులను కూడా ఆరాతీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న శ్రీనివాస్ అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వంకరబుద్ధి ప్రదర్శించడంతో బాధిత విద్యార్థినుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్‌లు విచారణ జరిపి నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా అస్సాంలో పదోతరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఒక హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. కోల్ కతా హత్యాచార ఘటనను సంబంధించిన వార్త పేపర్లో చదివి అత్యాచారం అంటే ఏమిటని తన బంధువును అడిగిందట. చివరకు తనకే అలాంటి ఆ పరిస్థితి ఎదురుకావడం ప్రతిఒక్కరినీ బాధిస్తోంది.