అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు మరోసారి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి కొత్త కళ వచ్చిందని ఏపీ వాసులు అనుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 33 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.అలాగే పాత నిర్మాణాలను యధా స్థానానికి తీసుకొచ్చారు. ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించింది ఏపీ ప్రభుత్వం. సుమారు పది నెలల పాటు నిధుల సమీకరణ కూడా జరిపించి.. అవన్నీ ఒక కొలిక్కి వచ్చాక.. ఇప్పుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడింది .
2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించి.. 2017 అక్టోబర్ లో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయించారు. అయితే అప్పట్లో మోదీ అమరావతికి భారీ ప్యాకేజీ ప్రకటిస్తారని అంతా అనుకున్నా..మోదీ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం.. అమరావతి విషయంలో నిర్లక్ష్యం చేసి ..మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలక్షేపం చేశారు తప్ప రాజధానికోసం ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.
ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోఅధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిపై మళ్లీ ఫోకస్ పెట్టింది. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉండటంతో.. అమరావతి రాజధాని నిర్మాణానికి వార్షిక బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని కూడా ప్రకటించింది. అంతేకాకుండా అమరావతికి అవసరమైన నిధులు సమకూర్చుతామని కూడా కేంద్రం హామీ ఇచ్చింది. రైల్వేతో పాటు రహదారులను పెద్ద ఎత్తున మంజూరు చేయడంతో అవన్నీ పట్టాలెక్కనున్నాయి. ఇదే సమయంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి.. కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.