తన సొంత అన్నతో విభేధించి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద యుద్ధమే చేశారు. పాలనాపరమైన తప్పులను ఎత్తి చూపుతూ మాటల తూటాలతో ప్రభుత్వానికి తూట్లు పొడిచారు. ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్ధతిచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక.. తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు తిరిగి పూర్వవైభవం తీసుకొస్తానని.. పార్టీని విడిచి వెళ్లిన నాయకులందరిని ఒక్కతాటిపైకి తీసుకొస్తానని షర్మిల ప్రకటించారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల్లో షర్మిల వ్యవహారశైలి ఎలా ఉంది?.. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏ మేరకు పని చేశారు? అనేది ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోందట.
ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా అనుకున్నదానికంటే ఎక్కువగానే ఇండియా కూటమి హవా చాటింది. కాంగ్రెస్‌కి సొంతంగా 99 స్థానాలను దక్కించుకుంది. బలమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి అవతరించింది. అయితే పలు చోట్ల ఊహించని విధంగా కాంగ్రెస్‌కు స్థానాలు దక్కాయి. కానీ ఏపీలో మాత్రం ఒక్క స్థానం కూడా దక్కలేదు. చతికిలపడి పోయింది. కనీసం కడప నుంచి పోటీ చేసిన షర్మిల కూడా గెలుపొందలేదు. పార్టీకే పూర్వవైభవం తీసుకొస్తామన్న షర్మిల ఓడిపోవడం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చీలిన ఓట్లన్నీ కూటమి వైపు మళ్లాయి. షర్మిల తన అన్న జగన్‌ను టార్గెట్‌గా చేసుకొని ముందుకెళ్లారు కానీ.. కాంగ్రెస్ ఫిలాసఫీని జనాల్లోకి తీసుకెళ్లడంతో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా షర్మిలపై ఎన్నికలవేళ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ముందు వైసీపీ నుంచి కొందరు నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చారు. అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ను అంటి పెట్టుకొని ఉన్న వారికి టికెట్లు ఇవ్వకుండా.. ఎన్నికల ముందు పార్టీ మారిన వారికి షర్మిల టికెట్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పార్టీలోని సీనియర్లన కూడా షర్మిల పక్కకు పెట్టారట. మాజీ ఎంపీ హర్షకుమార్, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌తో పాటు మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కాంగ్రెస్ గొడుగు కిందే ఉన్నారు. కానీ వారిని కూడా పట్టించుకోకుండా షర్మిల వ్యవహరించారట. ఎన్నికలయిపోయాక పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే షర్మిలపై విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలనే షర్మిల పట్టించుకోలేదని ఆరోపించారు. షర్మిల చేసిన కొన్ని తప్పిదాల వల్లే వైసీపీలో చీలిన ఓట్లన్నీ కూటమి వైపు మల్లాయని ఆరోపించారు. అలాగే షర్మిల తీరు వల్ల కాంగ్రెస్‌కు దగ్గరవ్వాల్సిన వైఎస్సార్ అభిమానులు కూడా ఆమె పట్ల సానుకూలంగా లేరని అన్నారు. అందుకే వారంతా కూటమి వైపు మొగ్గు చూపారని వెల్లడించారు.
ఈక్రమంలో షర్మిలను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే చర్చ కూడా హైకమాండ్ వద్ద వచ్చినట్ల తెలుస్తోంది. ఈక్రమంలో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీ తిరిగి గాడిలోకి వస్తుందనే దానిపై హైకమాండ్ చర్చలు జరుపుతోందట. ఇటీవల ఎన్నికల్లో కాపులు, కమ్మలు, బీసీలు, ఇతర సామాజిక వర్గాల వారంతా కూటమి వైపు మళ్లారు. కానీ రెడ్డి సామాజిక వర్గం మాత్రం జగన్ తీరుతో వైసీపీకి మద్ధతు ఇవ్వలేక.. అటు కూటమితో చేరలోక అయోమయంలో పడిపోయింది. ఈ సమయంలో రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకొని.. వారికి అండగా నిలబడితే కాంగ్రెస్ తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తోందట. రెడ్డి సామాజిక వర్గానిక చెందిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చి.. తగిన పదవులు కట్టబెట్టితే వారే పార్టీని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటోందట. వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గానిక చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు కూడా తమవైపు వస్తారని అనుకుంటోందట. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ బలమైన నేతకు పీసీసీ బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తనకు పదవీ గండం పొంచి ఉందన్న విషయాన్ని షర్మిల ముందే పసిగట్టారట. అందుకే పదవిని కాపాడుకునేందుకు తగు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌ను కలిశారు. రాహుల్, సోనియా గాంధీలతో భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేస్తానని కొంచెం సమయం ఇస్తే కచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తానని వారితో చర్చించారట. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల పట్ల సంతృప్తిగా లేనట్లుగా తెలుస్తోంది. షర్మిలను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని హైకమాండ్ గట్టిగా ఫిక్స్ అయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరి షర్మిలను సైడ్ చేసి ఎవరికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తారో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY