ఏపీలోని కృష్ణాజిల్లాలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్ధినుల వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టి భారీ ఎత్తున వీడియోలు చిత్రీకరించారన్న వార్తలు రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్ధినులంతా వారం రోజుల పాటు ఆందోళన కూడా చేపట్టారు. దీనిపై పోలీసులు ప్రాధమికంగా దర్యాప్తు చేసి రిపోర్టు ఇచ్చినా.. వారి పేరెంట్స్ సంతృప్తి చెందలేదు. దీంతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌తో సాంకేతిక దర్యాప్తు చేయించగా.. ఈ రిపోర్ట్ తాజాగా ప్రభుత్వానికి అందింది.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వాష్ రూములలో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని వస్తున్న ఆరోపణలపై.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దర్యాప్తులో తేలిన అంశాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. కాలేజీలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు కూడా గుర్తించలేదని ఐజీ వెల్లడించారు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సర్వీసులను వినియోగించామనితెలిపారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కాలేజీలో నమోదైన కేసు దర్యాప్తును ముగ్గురు ఐజీలు జి.వి.జి అశోక్ కుమార్, ఎం రవి ప్రకాష్, పీహెచ్డీ రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు రావడంతో.. వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆరోపణలు వచ్చిన వెంటనే .. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేసినట్లు చెప్పారు. వాష్ రూమ్‌లలో, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదని తేల్చి చెప్పారు.
విద్యార్థినులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించినట్లు ఐజీ తెలిపారు. విచారణలో కెమెరాలు,కానీ ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదని అశోక్ చెప్పారు. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందనీ విచారణలో అందరూ చెప్పారని వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా CERT సేవలు వినియోగించామని.. వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారని దీనిపై మరో మూడు రోజుల్లో తుది నివేదిక వస్తుందని చెప్పారు.తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్‌లు, ఒక ట్యాబ్ ను CERT బృంద సభ్యులకు అప్పగించామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.
విద్యార్థినులు ఎవరు భయపడనవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఎటువంటి ఆధారాలున్నా కూడా పోలీసుల దృష్టికి తేవచ్చని తెలిపారు. కాలేజీ యజమాన్యానికి తాము విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేసినట్లు ఐజీ తెలిపారు. ప్రెస్ మీట్ అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు వారి వద్ద ఏమైనా సాక్ష్యాలు ఉన్నా లేదా సందేహాలు ఉన్నా కూడా ధైర్యంగా చెప్పాలంటూ ఇద్దరు అధికారుల నంబర్లు ఇచ్చారు.