ఏపీని ఈ ఏడాది అల్పపీడనాలు, తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటిగా తుఫాన్లు వెంటాడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారానికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఇది డిసెంబర్ 15వ తేదీకి అల్పపీడనంగా మారి, వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది.
అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సోమ, మంగళవారాలలో కోస్తా,రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురుస్తుండటంతో..ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లాలోని తిరుమల, సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని ఆమె కోరారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలలోని ప్రజలు, అధికారులను అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.