విజయవాడలో భారీ వర్షాలు, వరదల వల్ల..అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, ప్రాజెక్టుల నుంచి వస్తోన్న వరద నీటితో కృష్ణా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇలాంటి కష్టకాలంలోనూ వైసీపీ వరద రాజకీయాలు చేయడానికి ప్రయత్నించడం చూసి ఏపీ వాసులు మండిపడుతున్నారు. సహాయ చర్యల నుంచి.. ప్రస్తుతం విజయవాడలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ వరకూ అంతా రాజకీయం చేయడానికి వైసీపీ చూస్తోంది.
కృష్ణలంక రిటైనింగ్ వాల్ క్రెడిట్ తమదేనంటూ అందుకే విజయవాడ ఈ మాత్రం అయినా సేఫ్ గా ఉందంటూ చెప్పుకొస్తోంది. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై..తెలుగు దేశం పార్టీల కౌంటర్లు ఇస్తోంది. ఈ 2024 మార్చి నెలలో వైఎస్ జగన్ సీఎం హోదాలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ ప్రారంభోత్సవం చేసిన విషయం నిజమే. 2.7 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వల్ల రాణిగారి తోట, తారక రామ నగర్, భూపేష్ గుప్త నగర్, కృష్ణలంక పరిసర ప్రాంతాల ప్రజలకు కృష్ణా నది నుంచి వచ్చే వరద ముంపు లేకుండా అడ్డుకట్టలా నిలిచిందన్న విషయం కూడా ఒప్పుకోవాల్సిందే.
దీనినే అవకాశంగా తీసుకుని వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒకవేళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయకపోయి ఉంటే.. ఈ వరదలకు కృష్ణలంకతో పాటు ఆ పరిసర ప్రాంతాలన్ని కూడా జల విలయంలో చిక్కుకుని ఉండేవని వైసీపీ చెబుతోంది. అయితే ఇక్కడే ఒక విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోతున్నారు. నిజానికి కృష్ణా నది నీరు విజయవాడను ముంచెత్తకుండా 2016 లో రిటైనింగ్ వాల్ ప్రతిపాదన తీసుకొచ్చిందే సీఎం చంద్రబాబు. జగన్ కంటే ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రిటైనింగ్ వాల్ నిర్మాణంలో మెజార్టీ భాగాన్ని పూర్తి చేశారన్నది రికార్డులు చెబుతున్నాయి.
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిధులతో నిర్మించిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ మొత్తం పొడవు 3.44 కిలోమీటర్లు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటి తాకిడి తట్టుకుని నిలిచేలా కృష్ణలంక రిటైనింగ్ వాల్‌ని నిర్మించారు. ఈ రిటైనింగ్ వాల్ మొత్తం నిర్మాణంతో లక్ష మంది ప్రజలకు వరద ముంపు నుంచి విముక్తి లభిస్తుందని అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసింది.
గతంలో ప్రతీ ఏడాదీ కృష్ణా నదికి వరదలు వచ్చిన ప్రతీసారి నది తీర ప్రాంతాల్లోకి వరద నీరు ఉప్పొంగి రావడంతో..చుట్టుపక్కల ప్రాంతాల వాసులు తమ ఇళ్లు ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు వెళ్లేవారు. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి 2016 లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం మొదలైంది.
ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని మూడు దశలుగా విభజించారు. దీనిలో ఒకటో ఫేజ్‌లో రూ. 165 కోట్ల బడ్జెట్‌తో యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు 2.37 కిలోమీటర్ల పొడవు నిర్మాణం.. రెండో ఫేజ్‌లో రూ. 126 కోట్ల నిధులతో గీతానగర్ నుంచి వారధి వరకు 1.23 కిలోమీటర్ల పొడవు నిర్మాణాన్ని ప్లాన్ చేశారు. ఇక మూడో ఫేజ్‌లో రూ. 110 కోట్ల నిధులతో వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు రిటైనింగ్ వాల్ ప్లానింగ్ జరిగింది. దీనిలో రెండు దశలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయిపోయాయి.
మూడో దశ నిర్మాణాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయాల్సి ఉంది. అయితే వైసీపీ నేతలు చేసిన రాజకీయాలతో అక్కడి ప్రాంత ప్రజలకు మరో చోట స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెప్పినా కూడా.. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్లారు. దీంతో మూడో ఫేజ్‌కు బ్రేక్ పడింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్..ఏడాదిలో పదవీకాలం ముగుస్తుందనగా..మూడో ఫేజ్ నిర్మాణంలో వేగం పెంచి ఈ ఏడాది మార్చి నెలలో ఈ రిటైనింగ్ వాల్‌ని ప్రారంభించారు.ఇప్పుడు దీనినే వైసీపీ నేతలు క్రెడిట్ అంతా తమదేనన్నట్లుగా టీడీపీ ప్రభుత్వంపై నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు.