ఏపీలో ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అయిదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ఘోర ఓటమి పాలయింది. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం.. మరొక్క అవకాశం ఇవ్వడంటూ జగన్ ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ ఏపీ ప్రజలు వైసీపీని ఓడగొట్టారు. కూటమికి పట్టం కట్టారు. ఈక్రమంలో వైసీపీ ఓటమికి గల కారణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలపై ఫోకస్ పెట్టింది. అసలు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాణ నిషేధం చేస్తామన్న వైసీపీ.. ఆ తర్వాత ప్రభుత్వమే మద్యం విక్రయించేలా కొత్త పాలసీని తీసుకొచ్చింది. అప్పటి వరకు ఏపీలో రిటైల్ అమ్మకాలు కొనసాగుతుండగా.. దానికి వైసీపీ ప్రభుత్వం బ్రేకులు వేసింది. ప్రభుత్వమే మధ్యం విక్రయించేలా పాలసీని తీసుకొచ్చింది. ఆ తర్వాత మద్యం ధరలను రెండు వందల రెట్లకు పెంచేసింది. అంతేకాకుండా అప్పటి వరకు వినియోగంలో ఉన్న మద్యం బ్రాండ్ల స్థానంలో ప్రభుత్వ దుకాణాల్లో అమ్మే వాటిని కొనే పరిస్థితిని తీసుకొచ్చింది. మద్యం ధరలు పెంచి మరో రకంగా వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపింది. దినసరి కూలీలు, శ్రమజీవులే ఈ భారాన్ని మోయాల్సి వచ్చింది.
రాష్ట్రంలో అవినీతిని రూపుమాపుతాం.. అవినీతి అనే మాటే వినపడకుండా చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఏసీబీనీ బలోపేతం చేస్తామని వైసీపీ చెప్పిన మాటలన్నీ నీటి మూటలయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి సేవలు కావాలన్నా అవినీతి లేనిదే పని కాని పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ ప్రభావం వైసీపీపై ఇప్పుడు పడింది. కులం, మతం అనే వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. కానీ గడిచిన అయిదేళ్లలో కులాభిమానం విషయంలో చంద్రబాబును పాలనను మించిపోయారనే ఆరోపణలు జగన్‌పై ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే రాజకీయ అధికారాన్ని కట్టబెట్టడం, కీలక పదవులు, ఉద్యోగాల కల్పనలో తన వారికే ప్రాధాన్యత ఇవ్వడం ప్రజలు, ఓటర్లు గుర్తించారు.
అలాగే జగన్ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేశారనే భావనకు మెజార్టీ ప్రజలు వచ్చారు. మూడు రాజధానుల పేరుతో వేసిన పిల్లిమొగ్గల్ని ప్రజలు తిరస్కరించారు. వేల కోట్ల రుపాయలతో అభివృద్ధి చేసిన నిర్మాణాలను నిరుపయోగంగా మార్చడాన్ని కోస్తా జిల్లాల ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం విపరీతంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం.. చెత్త పన్నులను విధించడంతో ప్రజలు తిరగబడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాకపోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న భావన ఉభయగోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలోని రైతుల్లో ఉంది. ఇవన్ని అంశాలు వైసీపీ ఓటమికి కారణమయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY