
దేశంలోనే అతి పెద్ద వంటశాల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది.2 వేల మంది నుంచి ప్రారంభమై ఇప్పుడు సుమారు 2 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం వండుతున్న వంటశాలగా మారింది . రోజూ సుమారు 12 టన్నుల బియ్యంతో పాటు 6 టన్నుల కూరగాయలతో వంటలు చేస్తూ నిత్యాన్న ప్రసాదాన్ని భక్తులకు అందిస్తుంది.4 దశాబ్దాలుగా ఏడుకొండలవాడి భక్తులకు రుచిగా, శుచిగా అన్న ప్రసాదం అందిస్తున్న వంటశాల..ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కిచెన్‌గా మారబోతుంది.
నిత్యాన్నదానం కోసం టీటీడీ ప్రతి నెల సుమారు రూ.105 కోట్లు ఖర్చు చేస్తోంది. సామాన్య భక్తుల నుంచి సంపన్న భక్తుల వరకు సాక్షాత్తు శ్రీవారి దివ్య ప్రసాదాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు ఏపీలో కొలువైన కూటమి ప్రభుత్వం టీటీడీపై దృష్టి పెట్టి.. అన్నదానంపైన మరింత ఫోకస్ చేసింది. క్వాలిటీ, సర్వీస్, మోడ్రన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వంటశాలను అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్‌తో భేటీ అయిన టీటీడీ ఈవో శ్యామలరావు సమూల మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రూ. 2 వేల కోట్ల డిపాజిట్ సొమ్ముతో.. ప్రతీ రోజూ సుమారు 2 లక్షల మంది భక్తులకు నిత్య అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. 40 ఏళ్లుగా టీటీడీ నిత్య అన్నదానం ఒక మహా యజ్ఞంలా నిర్వహిస్తోంది.
తిరుమల కొండకు వచ్చే శ్రీవారి భక్తులు.. అన్న ప్రసాదాన్ని మహా ప్రసాదంగా భావిస్తుండడంతో నిరాటంకంగా వారికి అన్న ప్రసాదాన్ని అందిస్తోంది టీటీడీ. భక్తులు సమర్పించే మొక్కులు, డిపాజిట్లను తిరిగి భక్తులకే ఖర్చు పెట్టే ఉద్దేశంతో అన్నదానం నిర్వహిస్తోంది. 1985 ఏప్రిల్ 6 న అప్పటి సీఎం ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ అన్న ప్రసాదం వితరణను టీటీడీ ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన భక్తుడు ఇచ్చిన రూ.5 లక్షల మొదటి విరాళంతో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రెండు సంవత్సరాలు రోజుకు 2వేల మందికి మాత్రమే పులిహోర వితరణ చేసిన అధికారులు.. 1987 తరువాత భోజన సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చారు. విరాళాల సంఖ్య పెరగడంతో 2013 ఏప్రిల్ 1 నుంచి భక్తులకు అన్న ప్రసాద పథకంగా ప్రారంభించారు అధికారులు.
2015 లో ఏకంగా రూ 100 కోట్లు విరాళాలు రాగా.. 40 ఏళ్లుగా నిత్య అన్నదానాన్ని టీటీడీ నిరంతరాయంగా కొనసాగిస్తోంది. అయితే కొన్ని రోజులుగా నిత్య అన్నదానం నిర్వహణ బాగాలేదని భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ ఫిర్యాదులపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం..నిత్య అన్నదానం మరింత సమర్థవంతంగా నిర్వహించాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే టీటీడీ ఈవో శ్యామల రావు దక్షిణ భారతదేశ చెఫ్స్ అసోసియేషన్‌తో తాజాగా భేటీ అయ్యారు. తిరుమలలోని గోకులం ఆఫీసులో ప్రఖ్యాత చెఫ్‌లు, టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించి.. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదాల తయారీ కేంద్రం ఆధునీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలని భావించారు.
రుచికరంగా పరిశుభ్రమైన అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు అందించేలా సూచనలు చేసిన నిపుణుల సలహాలను ఈవో పరిగణనలోకి తీసుకున్నారు. చెఫ్ నిపుణుల నుంచి సూచనలు, సలహాలను తీసుకున్న టీటీడీ పలు అంశాలను పరిశీలిస్తోంది. వంటశాల సిబ్బందికి శిక్షణ, వృత్తి నైపుణ్యంతో పాటు, ల్యాబ్ ఏర్పాటు, పరికరాల యాంత్రీకరణ, 3 నెలలకు ఒకసారి ఫుడ్ అనలిస్ట్ సూచనలు తీసుకోవాలని టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు. అన్నం సరిగా ఉడకడం లేదని భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో..వాటిని నియంత్రించి మంచి నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అన్నదాన సత్రంలో ఉన్న పరికరాలు పాతబడటంతో పాటు.. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బియ్యం ఉడికించాలంటే పెద్ద పరికరాలు అవసరం ఉందన్న అభిప్రాయానికి వచ్చారు. దీనికోసం అవసరమైన అత్యాధునిక పరికరాలను మార్పు చేయాలని టీటీడీ భావిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY