విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సీ ప్లేన్ టూరిజాన్ని ప్రారంభించారు. సీ ప్లేన్‌లో శ్రీశైలం బయలుదేరిన చంద్రబాబు.. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం తిరిగి విజయవాడకు చేరుకుంటారు. 14 సీట్ల సామర్థ్యంతో ఈ సీ ప్లేన్‌ను రూపొందించారు. త్వరలో ఇది సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్బంగా భవిష్యత్తు అంతా పర్యాటకానిదేనని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో అన్ని రంగాలు తగ్గిపోతాయి, కానీ టూరిజం మాత్రమే అభివృద్ధి చెందుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దేశంలో తొలిసారి పర్యాటక ప్రయోజనాల కోసం ‘సీ ప్లేన్’ సేవలను ఏపీ నుంచి ప్రారంభించారు. విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులతో కలిసి ప్రయాణించి పరిశీలించారు.
ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు..తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడని పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీలో అసమర్థమైన పరిపాలనను సరిచేసే బాధ్యతను తీసుకుని, రాష్ట్ర ప్రగతికి తామంతా కృషి చేస్తున్నామని అన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి మెరుగుపరిచే బాధ్యత తమపై ఉందని తెలిపారు.
అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..సీ ప్లేన్ సేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరో 3-4 నెలల్లో ఏపీలో ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని, సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం ఉంటుందని తెలిపారు.