తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన ఛైర్మన్‌గా టీవీ – 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకమండలి ఏర్పాట చేసింది. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కగా, తెలంగాణ నుంచి ఐదుగురికి, తమిళనాడుకు నుంచి ఇద్దరికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది.
టీటీడీపీ ఛైర్మన్‌గా తనను నియమించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కాగా టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.
బీఆర్ నాయుడు ప్రస్థానం
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి ఏదో సాధించాలన్న తపనతో కృషి చేసేవారు. స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చాలా చురుకుగా పనిచేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు.
ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బీఆర్ నాయుడు అంచలంచలుగా ఎదుగుతూ తర్వాత టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఓ ప్రపంచ స్థాయి నగరం రాజధాని ఉండాలనే విధానాన్ని బలంగా సమర్ధించారు. అమరావతి రాజధాని కోసం బీఆర్ నాయుడు పోరాడారు.