ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సమావేశం ప్రారంభమయిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టగా.. పలువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే గత ప్రభుత్వ చేపట్టిన పలు కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని.. వాటిపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని పలువురు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్రలు ఆరోపించారు. ఈ కార్యక్రమం పేరుతో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున దండుకున్నారని.. అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ముఖ్యమంగా దీనిపై సమగ్ర విచారణ జరిపి.. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమంపై ప్రభుత్వం కచ్చితంగా విచారణ చేపడుతుందని వెల్లడించారు. పనులు ఎందుకు సక్రమంగా జరగలేదు?.. జరిగిన చోట కడా నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు? అనే దానిపై విచారణ చేపట్టి నిజాలను బయటపెడుతామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఉపాధ్యాయులను అన్ని రకాలుగా గత ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు. త్వరలోనే కేజీ టు పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడుతామని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి చూపిస్తామని.. అందుకే మెగా డీఎస్సీ వేశామని నారా లోకేష్ అన్నారు.
అంతకంటే ముందు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. వైసీపీ నాయకులు నాడు నేడు ద్వారా అద్భుతాలు చేశామని ప్రచారం చేసి.. దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ అనుచరులకు టెండర్లు కట్టబెట్టి.. పనులు చేయకుండానే నిధులు డ్రా చేశారని అన్నారు. పాత భవనాలకు రంగులు వేసి కోట్ల రూపాయల బిల్ల పెట్టారని ఆరోపించారు. పనులు జరిగాక కూడా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని నరేంద్ర డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF