ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. గత అయిదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం తరుపున వైసీపీ అన్ని విధాలుగా కేంద్రానికి సహాయ సహకారాలు అందించింది. పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ ఎంపీలు మద్ధతు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్లి మోడీని కలిసి వచ్చేవారు. కానీ ఎన్నికల ముందు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ చేతులు కలపడంతో.. జగన్ బీజేపీకి కాస్త దూరమయ్యారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో మరింత దూరమయ్యారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి 21 స్థానాలను దక్కించుకుంది. 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు.. 3 స్థానాల్లో బీజేపీ.. 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు. వారంతా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్ధతు తెలియజేశారు. అసలు కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఏపీ కూటమి ఎంపీలు కీలకంగా మారారు. ఈక్రమంలో చంద్రబాబుకు.. ప్రధాని నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బుధవారం జరిగిన చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి కూడా మోడీ హాజరయ్యారు.
ఓవైపు పార్లమెంట్‌లో అత్యధిక బలం మాకే ఉందని టీడీపీ కూటమి అంటుంటే.. మాకు కూడా బలం ఉందని వైసీపీ అంటోంది. తాజాగా దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీలకు రాజ్యసభ, లోక్‌సభలో ఉన్న బలాబలగాలను వివరించారు. టీడీపీకి లోక్ సభలో 16 సీట్లు ఉంటే.. తమకు రాజ్యసభ, లోక్ సభలో కలిసి 15 సీట్లు ఉన్నాయని విజయసాయి రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్‌లో తమ బలం ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి బీజేపీకి వైసీపీ అవసరం ఉందని గుర్తించాలన్నారు. అలాగే రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో ఎన్డీయే ప్రవేశ పెట్టబోయే అన్ని బిల్లులకు తమ మద్ధతు ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE