
ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఓటేసేందుకు క్యూలో రావాలని చెప్పినందుకు.. ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు క్యూలైన్‌లో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తుండటంపై ఓటరు అభ్యంతరం తెలిపాడు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటరు కూడా అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
అలాగే.. కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడులు, ప్రతిదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సాధారణ ఓటర్లు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. చిత్తూరు జిల్లా మండి కృష్ణాపురంలో వైసీపీ ఏజెంట్ సురేష్‌పై దాడి జరిగింది. కత్తిపోట్లకు గురవడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని వైసీపీ ఆరోపణతో గొడవ జరిగింది. పరస్పర దాడుల్లో నవీన్ అనే వ్యక్తికి రక్త గాయాలు అయ్యాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం కొత్తపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రోడ్లపై వచ్చి కొట్టుకున్నారు. ఈ కొట్లాటలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రకాశం జిల్లా దర్శిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బట్లపాలెంలో వైసీపీ- టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. దాడిలో 10 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట లో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈవీఎంలను పగలగొట్టారు. దీంతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. 192 పోలిగ్ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు కొత్త ఈవీఎంలను తెచ్చి కొనసాగిస్తున్నారు. కడమ జమ్మలమడుగులో జనసేన ఏజెంట్ లేకుండా పోలింగ్ నిర్వహించడంపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, కూటమి నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలనూ చెదరగొట్టారు. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు పెంచడంతో మధ్యాహ్నం తర్వాతో పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీలో 40.26 పోలింగ్ శాతం నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY