
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని పోలీస్ పికెట్ లు కొనసాగించాల్సి వస్తోంది. పల్నాడు జిల్లాలో ఇంకా ప్రశాంత వాతావరణం ఏర్పడలేదు. పోలీసులు ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకుల ఇళ్లల్లో నాటు బాంబులు, పెట్రో బాంబులు, కత్తులు భారీ ఎత్తున బయటపడుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తల సంగతేమో కానీ స్థానికులను మాత్రం ఈ దాడులు భయబ్రాంతులకు గురి చేశాయి. నిత్యం పోలీసు వాహనాల సైరన్ ల మోత ఆందోళన కలిగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసీ తీవ్రంగా సీరియస్ అయింది. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచి మాట్లాడింది. హింసాత్మక ఘటనకు కారకులెవరు, సహకరించిందెవరు.. అన్న వివరాలపై ఆరా తీసింది.
ఈసీ ఆదేశాలతో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు ప్రభుత్వ అధికారులు సిట్ ఏర్పాటు చేశారు. 13 సభ్యులతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఈ సిట్ పని చేయనుంది. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత పని చేయనున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్ స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్ స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్ సభ్యులుగా నియామకమయ్యారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు ఈరోజు ఈసీకి సిట్ నివేదిక అందివ్వనున్నట్టు సమాచారం. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలోని జరిగిన ఘటనలపై నివేదించనున్న తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలకు కారకులైన నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసులపైనా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా హింసాత్మక ఘటనలు జరిగిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం విధించారు.
ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయి. ఉద్రిక్త వాతావరణాన్ని చల్లార్చి ప్రజలకు భరోసా కల్పించేందుకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని ఈసీ ఆదేశించింది. ఈమేరకు ఇప్పటికే రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. కాగా, నివేదిక అందగానే ఈసీ తదుపరి చర్యలు చేపట్టనుంది. ఈక్రమంలో కీలక నేతలు అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో కొందరు నేతలు పరారీలో ఉన్నారని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY