ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సంబరాలకు సిద్ధం కండి అంటూ.. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష కూటమి అధినాయకులు ఇరుపక్షాలూ శ్రేణులకు పిలుపునిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఎగ్జాక్ట్ పోల్స్ ఉంటాయని అధికార పార్టీ ధీమా గా ఉంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల తాజాగా మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు అందరూ సంబరాలకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. అలాగే.. వైసీపీకి మద్దతుగా పరిపూర్ణానంద స్వామి కూడా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్న ఆయన.. ఏపీలో వైసీపీకి 123 స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఏపీ కూటమిదేనని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించిన తర్వాత కూడా ఈ తరహా వాదనలు తెరపైకి రావడం ఆసక్తిగా మారింది.
ఇదిలాఉండగా.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని నివాసం నుంచి మంగళగిరిలోని ఎన్డీఆర్ భవన్‌కు సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత.. ఆయన తొలిసారి సోమవారం కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యం లో కార్యకర్తలు, నాయకులు కూడా.. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఊహించని విధంగా స్వాగతం పలికారు. ఇదిలాఉండగా.. ఇక్కడ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. వాస్తవానికి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. దీంతో వారు ఇలా చేయొచ్చా.. అనేది సందేహంగా మారింది. అయితే.. మారుతున్న ట్రెండ్ ను బట్టి వారు జాగ్రత్తలు తీసుకున్నారా? అనేది చర్చనీయాంశం అయింది. మరోవైపు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా టీడీపీ కూటమికే మొగ్గు చూపుతున్నాయి. దీంతో పోలీసులు టీడీపీ అధినేత కు సెల్యూట్ చేశారనే చర్చ జరుగుతోంది.
దీనికితోడు.. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. సంబరాలు రేపు చేసుకుందామని.. శక్తిని అప్పుడే ఖర్చు చేసుకోవద్దంటూ శ్రేణులతో చంద్రబాబు చమత్కరించారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయం సందడి వాతావరణంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ బ్యాకాఫీస్‌లో పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు. ఎన్నికల్లో తన పర్యటనలు కోఆర్డినేట్ చేసిన బృంద సభ్యులను అభినందించారు. పెందుర్తి వెంకటేష్, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు, గంటా గౌతమ్, రవి యాదవ్, రాజశేఖర్, శ్రీనివాస్ చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని కోఆర్డినేట్ చేశారు. ప్రచారంలో భాగంగా రోజుకు 3 నుంచి 5 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనేలా ఈ బృందం సమన్వయం చేసింది. బాగా కష్టపడి పని చేశారంటూ బృంద సభ్యులను తన నివాసంలో చంద్రబాబు అభినందించారు.
మరోవైపు.. సంబరాలు సిద్ధం కావాలని వైసీపీ నుంచి కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రాకముందు, పోలింగ్ పూర్తయిన తర్వాత రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోయే సమయం, వేదిక కూడా చెప్పేశారు. అయితే.. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆయన సైలెంట్‌గా ఉన్నారు. అయితే మనదే గెలుపు అంటూ సజ్జల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసుకోవచ్చని సూచనలు ఇచ్చారు. ఈక్రమంలో ఏపీకి ఎవరు సీఎం అవుతారో అనే ఉత్కంఠ మరింత పెరిగింది. దాదాపు నేటి మధ్యాహ్నంతో ఆ ఉత్కంఠకు తెరపడనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY