కొంతమంది ఏ పార్టీ నుంచి గెలిస్తే ఆ పార్టీ ఓడిపోతుందనే ట్యాగ్ వేస్తుంటారు. వీరి ఎదురుగానే కామెంట్లు చేస్తూ సరదాగా ఆట పట్టిస్తుంటారు మరికొంతమంది. ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న ఆర్కే రోజా, టీడీపీకి చెందిన ఉరవకుండ సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పైన కూడా ఇలాంటి కామెంట్లు వినిపిస్తుంటాయి.
ఆర్కే రోజా 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలవడంతో అప్పుడు ఆ పార్టీ ఓడిపోయిందని,వైఎస్ జగన్ ప్రతిపక్షంలో కూర్చున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో రోజాను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఆమె గెలవడం, వైసీపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆర్కే ఆ ట్యాగ్ నుంచి బయట పడ్డారు.
కానీ పయ్యావుల కేశవ్ మాత్రం ఇంకా ఆ ట్యాగ్ నుంచి బయట పడలేదు. పయ్యావుల కేశవ్ ఎప్పుడు గెలిచినా కూడా..టీడీపీ ఓడి పోయి , ప్రతిపక్షానికే పరిమితం అవుతుందనే సరదా చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరయిన పయ్యావుల కేశవ్.. 2004, 2009 ఎన్నికల్లో ఉరవకొండ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
అయితే ఈ రెండు సార్లు టీడీపీ ఓడి పోవడంతో పాటు… చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేక పోయారు. తిరిగి 2019లో పయ్యావుల గెలిచినపుడు కూడా టీడీపీ ఓడి పోయి.. చంద్రబాబు ప్రతిక్ష నేతగా మిగిలి పోయారు.కానీ 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓడి పోయినపుడు మాత్రం టీడీపీ గెలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో జరిగిన ఎన్నికలలో కూడా పయ్యావుల ఓడిపోవడం.. టీడీపీ అధికారంలోకి రావడంతో పాటు..చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని ఒక టాక్ ఉంది.
అంతెందుకు గతేడాది మార్చిలో జరిగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ జరిగింది. బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగం తర్వాత ఎమ్మెల్యేలంతా లాబీల్లోకి వచ్చి మాట్లాడుకుంటుండగా.. పయ్యావుల కేశవ్,వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎదురుపడ్డారు. ఈ సమయంలో 2024 ఎన్నికల్లో కూడా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలవాలని కోరుకుంటున్నానని పేర్ని నాని అన్నారట. దీంతో పయ్యావుల ఎందుకని ప్రశ్నిస్తే తమరు గెలిస్తే టీడీపీ ఓడిపోతుంది కాబట్టి అని కామెంట్ చేశారట.
దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చిన పయ్యావుల కేశవ్.. అలాంటి సెంటిమెంట్ 2024లో పని చేయదని అన్నారట. 1994లో ఉరవకొండలోను, రాష్ట్రంలోను టీడీపీ గెలిచిందన్న విషయాన్ని గుర్తు చేసి 2024లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని సమాధానమిచ్చారట. అయితే మరోవైపు ఈ ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఆ ముద్ర నుంచి బయటపడుతారో లేదో చూడాలని ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY