కారణాలు ఏదయినా కానీ మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా అత్యుత్సాహమో.. వైసీపీ నేతల ఓవర్ యాక్షనో కానీ అల్లు అర్జున్ కు, పవన్ కళ్యాణ్ కు దూరం రోజురోజుకు పెరుగుతున్నట్లే ఉంది. అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ డైలాగ్ నుంచి ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ నేత ఇంటి వెళ్లడం వరకూ ప్రతీదీ బూతద్దం పట్టుకుని వెతికే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. దీనికి తోడు తాజాగా తన ఇష్టమైన వారి కోసం వస్తానని బన్నీ చేసిన ప్రకటనతో ఇది మరోసారి రాజుకుంది.
అయితే ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ మాటల్లో సినిమాల్లో ఎర్ర చందనం స్మగ్లర్లే హీరోలుగా ఉంటున్నారని అనడాన్ని బన్నీ ఫ్యాన్స్ తో పాటు వైసీపీ నేతలు కూడా హైలెట్ చేశారు. ఇదే అంశంపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ ..పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో వేడి పీక్స్ కు వెళ్లింది.
అటు అల్లు అర్జున్ వ్యాఖ్యలు.. ఇటు ఆయన మామ విమర్శలను వైసీపీ ఫాలోవర్లు చంకలు గుద్దుకుంటూ హైలెట్ చేసే పనిలో పడితే..ఇటు జనసైనికులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అల్లు అర్జున్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు. కాగా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అర్జున్ సొంత తండ్రిని గెలిపించుకోలేకపోయారని, అర్జున్ కు అసలు ఫ్యాన్స్ లేరని..అంతా మెగా ఫ్యాన్సేనని చెప్పుకొచ్చారు. ఈ మాటలు ఖచ్చితంగా మరింత చిచ్చు పెట్టేలా ఉన్నాయి.
రాజకీయాలకు సంబంధం లేని అల్లు అర్జున్ వ్యాఖ్యల కేంద్రంగా ఏర్పడిన వివాదంతో.. జనసేనకు వ్యతిరేకంగా ఓ బలమైన క్యాంపెయిన్ నిర్వహించడానికి వైసీపీకి అవకాశం దొరికింది. వెంటనే వైసీపీ సానుభూతిపరులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రూపం మారిపోయి అసలు రాజకీయాలను ప్రారంభించారు. దీంతో ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది.
ఏది ఎలా ఉన్నా ఇది రాజకీయ రంగు పులుపుకుంది కాబట్టి..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి చెక్ పెడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీకి సూటిగా సమాధానం చెప్పగల సత్త పవన్ కు ఉంది కాబట్టి వెంటనే రంగంలోకి దిగితే బాగుంటుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.