సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి వెళతారా?

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు అందడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. విజయసాయిని విచారణకు రావాలంటూ పిలిచిన సీఐడీ .. ఆయనను మార్చి 12న సీఐడీ ఆఫీసులోనే విచారణ చేయనుంది. అయితే ఈ విచారణకు విజయసాయి రెడ్డి వస్తారా రారా అన్నదే చర్చనీయాంశం అయింది. ఆయన తదుపరి కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

మాజీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డిపై కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో కేసు నమోదైంది. పోర్టు వాటాలను తన నుంచి అక్రమంగా బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేయడంతో ..మార్చి 12న విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలో ఉన్న సీఐడీ కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాలని ఆయనను ఆదేశించారు.

కేవీ రావు ఫిర్యాదుతో కాకినాడ పోర్టు వాటాల బదిలీపై..విజయసాయి రెడ్డితో పాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1గా విక్రాంత్ రెడ్డి, ఏ-2గా విజయసాయిరెడ్డి, ఏ-3గా శరత్ చంద్రారెడ్డి, ఏ-4 గా శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా ఉన్నారు. కాగా ఇదే కేసులో గతంలో ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి విచారణకు కూడా హాజరయ్యారు. అయితే తాజాగా ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను ప్రస్తావించిన సీఐడీ అధికారులు.. మాజీ ఎంపీ సాయిరెడ్డికి ఈ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసులో విక్రాంత్‌ రెడ్డికి ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఊరట లభించింది. అయితే ఈ విచారణ సమయంలో విజయసాయికి సీఐడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈడీ ఎదుట ఆయన హాజరవడంతో.. సీఐడీ ఎలాంటి విచారణ చేపడుతుందోనన్న చర్చ సాగుతోంది.

ఇటు విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి ఇప్పటికే వైదొలిగారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడంతో పాటు రాజకీయ సన్యాసంలో ఉంటున్నారు. ఇప్పుడు సాయిరెడ్డి కేసులు కోర్టులు అంటూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు కాకినాడ పోర్టు కేసు విషయంలో కోర్టుకు వెళ్లలేదు. అయితే ఆయన ముందస్తు బెయిల్‌ దాఖలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.