ఏపీ రాజధాని అమరావతి డెవలప్మెంట్‌కు సంబంధించి కీలకమైన శాశ్వత గవర్నమెంట్ భవనాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి CRDA చర్యలు చేపట్టింది.
CRDA అసెంబ్లీ భవనం కోసం 768 కోట్ల రూపాయలు, హైకోర్టు భవనం కోసం 1,048 కోట్ల రూపాయలు అంచనా వేసి బిడ్లను ఆహ్వానించింది. ఈ టెండర్ల దాఖలు గడువును మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు పెట్టింది. అలాగే టెక్నికల్ బిడ్ సమర్పణకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు గడువు పెట్టింది. ఇక ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలనకు అర్హతలు పరిశీలించాక ఏజెన్సీల ఎంపిక ఉంటుంది.
అసెంబ్లీ భవన నిర్మాణం విస్తీర్ణం 103.76 ఎకరాల్లో 11.21 లక్షల స్క్వేర్ ఫీట్‌గా నిర్ణయించారు. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 3 అంతస్తులు నిర్మించనుండగా..లండన్‌కు చెందిన ప్రముఖ సంస్థ నార్మన్ పోస్టర్స్ దీనికి డిజైన్ చేస్తున్నారు. పైభాగం శిఖరాకారంలో ఉండేలా,పైకి ఎక్కితే నగరం మొత్తం చూడగలిగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికోసం 2018లో అంచనా 555 కోట్లు రూపాయలు ఉండగా ప్రస్తుత అంచనా 768 కోట్ల రూపాయలకు చేరింది.
మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్, క్యాంటీన్లు, లైబ్రరీ, సెంట్రల్ హాల్ ఉండగా..రెండో అంతస్తులో అసెంబ్లీ, కౌన్సిల్ హాళ్లు, కమిటీ ఛాంబర్లు, సభ్యుల లాంజ్, శిక్షణ కేంద్రం ఉండనున్నాయి. అలాగే శాశ్వత హైకోర్టు భవనాన్ని 42.36 ఎకరాల్లో 20.32 లక్షల స్క్వేర్ ఫీట్‌లో నిర్మించనున్నారు. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 7 అంతస్తులుతో నిర్మిస్తారు.గత అంచనా వ్యయం 860 కోట్లు రూపాయలు కాగా..ప్రస్తుత అంచనా వ్యయం 1,048 కోట్లుకు చేరింది.