ఏపీలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. మరో 24 గంటల్లో పార్టీల, అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సమయంలో పోస్టల్ బ్యాలట్లకు సంబంధించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది.
పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ.. ముందుగా ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడ వైసీపీకి షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో తాము కలుగజేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈసీ జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ మార్గదర్శకాలపై తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనుండంతో.. ఈరోజే ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోర్టును వైసీపీ కోరింది.
ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలట్లకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు బరి తెగించినట్లుగా ఉన్నాయన్నారు. సీల్.. ఇతర వివరాలు లేకుండా.. కేవలం అధికారి సంతకం ఉంటే సరిపోతుందని చెప్పడం అడ్డగోలుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకం ఎవరిదన్న విషయం ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఈ ఆదేశాలను ఈసీ తికమక పెట్టడానికి ఇచ్చిందో.. ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. తాజాగా వైసీపీకి సుప్రీంకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE