
ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట అసెంబ్లీ నియోజక వర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యకత ఉంది. ఇంకా చెప్పాలంటే ఆచంట అసెంబ్లీ నియోజక వర్గం ఎప్పుడయితే రిజర్వుడు స్థానం నుంచి జనరల్ స్థానంగా మారిందో అప్పటి నుంచీ ఈ ప్రత్యేకత సంతరించుకుంది.
ఎందుకంటే ఆచంట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయాన్ని సాధిస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు.. అధికార పీఠంలో కూర్చుంటుందంటూ ఒక సెంటిమెంట్ ఉంది. అంతేకాకుండా ఆచంట నుంచి గెలిచిన అభ్యర్థిని.. మంత్రి పదవి కూడా వరిస్తుందన్న టాక్ ఉంది.
2019లో జరిగిన ఎన్నికల ఫలితాలలో కూడా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవడంతో..ఇప్పుడు మరోసారి ఆచంట వార్తలలోకి ఎక్కింది. ఆచంట అసెంబ్లీ నియోజక వర్గం రిజర్వుడ్ స్థానం నుంచి జనరల్ స్థానంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. అలా మూడు సార్లు గెలిచిన వారికి మంత్రి పదవులు దక్కడంతో పాటు.ఆ అభ్యర్ధుల పార్టీలే అధికారంలోకి వచ్చాయి.
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన పితాని సత్యనారాయణ..తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కర్రి రాధాకృష్ణారెడ్డిపై విజయాన్ని సాధించారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలలో విజయం సాధించి.. అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పుడు సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కింది.
తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో 2014లో జరిగిన ఎన్నికల్లో..ఆచంటలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పితాని గెలుపొందారు. విభజన అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు..అప్పటి సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో పితాని సత్యనారాయణ మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఆచంటలో విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను సొంతం చేసుకొన్న వైసీపీ అధికారిన్ని కైవసం చేసుకోవడంతో పాటు..సీఎం జగన్ ప్రభుత్వంలో శ్రీరంగనాధరాజుకు మంత్రి పదవి దక్కింది.
అయితే 2024లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పాత ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బరిలోకి దిగగా, వైసీపీ నుంచి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు బరిలోకి దిగారు. దీంతో ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY