మెగాస్టార్ చిరంజీవిని ఈ ఏడాది ఏఎన్నార్ నేషనల్ అవార్డు వరించింది. అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించాడు. ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ ను కూడా రీరిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు. నాగార్జునతోపాటు అక్కినేని కుటుంబం మొత్తం హాజరైన ఈ వేడుకలోనే అక్కినేని జాతీయ అవార్డు విషయాన్ని వెల్లడించాడు నాగ్.
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ ఏఎన్నార్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించిన సెలబ్రిటీలకు ప్రతి ఏటా ఈ అవార్డు ఇస్తున్నారు. ఈ ఏడాది పద్మ విభూషణ్ అయిన మెగాస్టార్ కు ఇవ్వాలని ఫౌండేషన్ నిర్ణయించినట్లు ప్రకటించిన అక్కినేని నాగార్జున..అక్టోబర్ 28న ఈ ఈవెంట్ జరగనున్నట్లు వివరించాడు.
ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడిన నాగార్జున..ఏఎన్నార్ అవార్డును ప్రతి ఏటా కాకపోయినా రెండేళ్లకోసారైనా ఇస్తున్నామని అన్నారు. ఈసారి ఈ అవార్డును చిరంజీవిగారికి ఇద్దామని నిర్ణయించామని.. ఈ విషయాన్ని ఆయనకు చెప్పగానే చాలా ఎమోషనల్ అయి హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పారని గుర్తు చేసుకున్నాడు.
శతజయంతి సంవత్సరంలో ఈ అవార్డు చిరంజీవికి ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని నాగార్జున చెప్పాడు. ఈ అవార్డు ఇవ్వాలని అమితాబ్ బచ్చన్ గారిని కోరగానే ఆయన కూడా వస్తానన్నారని నాగ్ చెప్పాడు. అక్టోబర్ 28న ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించామని నాగార్జున అన్నాడు.