“తగ్గేదేలే” అంటూ పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన అల్లు అర్జున్, తన సక్సెస్ జర్నీని పుష్ప 2 తో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాడు. గంగోత్రి ద్వారా వెండితెరకి పరిచయం అయిన ఆయన, ఆర్యతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించి, డాన్స్, స్టైల్, యాక్టింగ్‌లో తనదైన శైలిని చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
పుష్ప 2కి భారీ అంచనాలు
డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రూ. 1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడం, పుష్ప 2 బడ్జెట్ రూ. 500 కోట్లకు చేరడం అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నార్త్ ఆడియన్స్‌తో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది.
రికార్డ్ రెమ్యూనరేషన్
అల్లు అర్జున్ ఈ చిత్రానికి తీసుకున్న పారితోషికం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, పుష్ప 2కు ఆయన దాదాపు రూ. 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది షారుఖ్ ఖాన్, దళపతి విజయ్, ప్రభాస్ వంటి ప్రముఖ నటులు తీసుకున్నదానికంటే ఎక్కువ. దీంతో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ (300 కోట్లు ) తీసుకున్న తొలి నటుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. పుష్ప 2లో రష్మిక మందాన సైతం కెరీర్‌లో అత్యధిక పారితోషికం రూ. 10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఫహద్ ఫాజిల్ రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారు. హిందీ చిత్రాలతో రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతూ, పుష్ప 2లోనూ తన ప్రాధాన్యాన్ని చాటుకున్నారు.
పుష్ప 1 విజయాన్ని మించి…
2021లో విడుదలైన పుష్ప చిత్రం పాన్ ఇండియా హిట్‌గా నిలిచి, రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. హిందీ వెర్షన్ సైతం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. పుష్ప 2 ఈ విజయాన్ని మించేలా హిందీ వెర్షన్‌తో రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం భారీ ప్రమోషన్ ప్లాన్ చేసింది. నవంబర్ 17న పాట్నాలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించి, దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేయనున్నారు.
పాన్ ఇండియా విజయం దిశగా
అల్లు అర్జున్‌తో సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం, టాలీవుడ్ నుండి నాన్-రాజమౌళి సినిమాగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పుష్ప 2 మరోసారి అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను మరింత బలపరుస్తుందని నిశ్చయం.