సోమవారం అన్నపూర్ణా స్టూడియోస్ లో ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదాన సభ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరథమహారధులు హాజరవడంతో ఆద్యాంతం కలర్ ఫుల్ గా సాగింది. మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నార్ జాతీయ అవార్డును అమితాబ్ చేతుల మీదుగా అందుకున్నారు.అయితే ఈ వేడుక గురించి అటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఇటు మెగా స్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ జాతీయ అవార్డు’ వేడుకకు బిగ్ బీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఘనంగా జరిగిన ఈ వేడుక గురించి బిగ్ బీ పోస్ట్ పెట్టారు. చిరంజీవి,నాగార్జునలతో దిగిన ఫొటోను కూడా నెటిజన్లతో పంచుకున్నారు. ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా ఏఎన్నార్ కుటుంబంలోని, పరిశ్రమలోని వ్యక్తిగా ఆయనకు నివాళులర్పించానని అమితాబ్ చెప్పారు.
ఇది భావోద్వేగాలతో నిండిన సాయంత్రమని అమితాబ్ ట్వీట్ చేశారు. ఇంత గొప్ప వేడుకలో తనను భాగం చేసినందుకు నాగార్జునకు ధన్యవాదాల అని అన్నారు. అలాగే చిరంజీవికి తన చేతులమీదుగా ఈ అవార్డు ఇవ్వడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని అమితాబ్ ట్వీట్ చేశారు.
ఇటు ఈ అవార్డు వేడుకపై చిరంజీవి కూడా తన సంతోషాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ‘అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఏఎన్నార్ పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ‘ఏఎన్నార్ జాతీయ అవార్డును తాను అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అది కూడా తన గురువు అమితాబ్ చేతులమీదుగా అందుకోవడం మరింత సంతోషాన్నిచ్చిందన్నారు.
అక్కినేని కుటుంబంలోని ప్రతిఒక్కరికీ, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సభ్యులకు, తన మిత్రుడు, సోదరుడు సుబ్బరామిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు చిరు. తన సినీ ప్రయాణంలో భాగమై తన ప్రతి మైలురాయికి సహకరించిన ప్రతిఒక్కరికీ ఎంతో రుణపడి ఉంటానని మెగాస్టార్ రాసుకొచ్చారు. అలాగే ఆ అవార్డు వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.